Kakani Govardhan Reddy: కాకాణి కుమార్తె ఖాతాలోకి రూ.70 లక్షలు.. సిట్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి!

Kakani Govardhan Reddy Daughter Account Receives 70 Lakhs SIT Questions
  • గ్రావెల్ కేసులో మాజీ మంత్రి కాకాణి రెండో రోజు సిట్ విచారణ
  • ఏ1 నిందితుడి ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు రూ.70 లక్షల బదిలీ
  • ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి సారించిన అధికారులు
  • విచారణలో ప్రశ్నలకు దాటవేత సమాధానాలు ఇచ్చిన కాకాణి
  • తనకు, తన కుమార్తె లావాదేవీలకు సంబంధం లేదని వెల్లడి
సర్వేపల్లి జలాశయంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో సిట్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు విచారణలో అధికారులు కీలక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న నిరంజన్ రెడ్డి బ్యాంకు ఖాతా నుంచి కాకాణి కుమార్తె ఖాతాకు రూ.70 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించిన సిట్ అధికారులు, దీనిపై ఆయనను కూలంకషంగా ప్రశ్నించినట్లు స‌మాచారం.

కృష్ణపట్నం పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణకు బాపట్ల సిట్ డీఎస్పీ రామాంజనేయులు నేతృత్వం వహించారు. తొలి రోజు విచారణలో కాకాణి నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో రెండో రోజు అధికారులు పూర్తిగా ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. గ్రావెల్ అక్రమ తవ్వకాల సమయంలో నిరంజన్ రెడ్డి ఖాతా నుంచి జరిగిన రూ.10 కోట్ల విలువైన లావాదేవీలను అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే కాకాణి కుమార్తె ఖాతాకు బదిలీ అయిన రూ.70 లక్షల విషయంపై అధికారులు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కాకాణి స్పందిస్తూ, "నా కుమార్తెకు వివాహం చేసి పంపించాను. వారి వ్యాపార లావాదేవీలతో నాకేలాంటి సంబంధం లేదు. వారి మధ్య ఏం జరిగిందో నాకేం తెలుసు?" అని సమాధానమిచ్చినట్లు సమాచారం. అలాగే, నిరంజన్ రెడ్డి సింగపూర్‌లో కొనుగోలు చేసిన గృహోపకరణాలు మీ ఇంటికేనా అని ప్రశ్నించగా... తన ఇంట్లోని వస్తువులన్నీ తానే కొనుగోలు చేశానని కాకాణి చెప్పినట్లు తెలిసింది. విచారణలో చాలా ప్రశ్నలకు ఆయన ఇదే రీతిలో దాటవేత సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది.

మధ్యాహ్నం 3 గంటల వరకు సాగిన ఈ విచారణ అనంతరం అధికారులు కాకాణిని జిల్లా రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన్ను తిరిగి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతోంది.
Kakani Govardhan Reddy
Sarvepalli Reservoir
Gravel illegal mining
Niranjan Reddy
SIT investigation
Financial transactions
Nellore
Magunta Srinivasulu Reddy
Krishna Patnam Police Station
Andhra Pradesh

More Telugu News