Bengaluru: బెంగళూరులో దారుణం.. వంట విషయంలో భార్యను న‌రికి చంపిన వృద్ధుడు

Bengaluru Man Kills Wife After Argument About Cooking Arrested
  • బెంగళూరులో వృద్ధ దంపతుల మధ్య తీవ్ర ఘర్షణ
  • భార్య‌ను కొబ్బరి తురిమే పీటతో హత్య చేసిన భ‌ర్త‌
  • తిరుపతికి పారిపోయేందుకు నిందితుడి ప్రయత్నం
  • రామనగర వద్ద పట్టుకున్న మాగడి పోలీసులు
వంట చేసే విషయంలో తలెత్తిన చిన్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఓ వృద్ధుడు ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ఈ హత్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... మాగడి సమీపంలోని మత్తికెరె గ్రామంలో రంగయ్య (68), తిమ్మమ్మ (65) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. బుధవారం రాత్రి వంట చేసే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ గొడవ తీవ్రం కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రంగయ్య, ఇంట్లో ఉన్న కొబ్బరి తురిమే పీటతో భార్య తిమ్మమ్మపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

అనంతరం నేరం నుంచి తప్పించుకునేందుకు రంగయ్య పథకం వేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా గురువారం ఉదయాన్నే తిరుపతికి పారిపోయేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఈ హత్య గురించి సమాచారం అందుకున్న మాగడి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడు పారిపోతున్నాడని తెలుసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రామనగర వద్ద రంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి గొడవకే కట్టుకున్న భార్య ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Bengaluru
Rangayya
Bengaluru Crime
Wife Murder
Karnataka News
Magadi
Old age crime
Domestic dispute
Thimmamma
Coconut scraper
Ramnagar

More Telugu News