Henrik: సోషల్ మీడియా స్నేహితురాలి కోసం భారత్‌కు.. అవమానంతో వెనుదిరిగిన డచ్ జాతీయుడు!

Henriks Social Media Romance Leads to Disappointment in India
  • సోషల్ మీడియాలో పరిచయమైన అమ్మాయి కోసం బెంగాల్ వచ్చిన యువకుడు
  • స్నేహితురాలు మైనర్ అని తెలియక, ఆమె స్కూల్ వద్ద గంటల తరబడి నిరీక్షణ 
  • అనుమానంతో పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
  • అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు
  • భారత్‌లో అవమానం జరిగిందని, మళ్లీ రానని చెప్పిన డచ్ జాతీయుడు
సోషల్ మీడియాలో పరిచయమైన స్నేహితురాలిని కలిసేందుకు ఏడు సముద్రాలు దాటి భారత్‌కు వచ్చిన ఓ డచ్ జాతీయుడికి చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో స్థానికుల నుంచి అనుమానాలు, పోలీసుల విచారణ ఎదుర్కొని, చివరికి తను కలవాలనుకున్న స్నేహితురాలిని చూడకుండానే తీవ్ర నిరాశ, అవమానంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన అతడు భవిష్యత్తులో మళ్లీ భారత్ గడ్డపై అడుగుపెట్టనని శపథం చేశాడు.

నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన 37 ఏళ్ల హెన్రిక్స్‌కి సోషల్ మీడియా ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లా తెహట్టా ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. వారి స్నేహం బలపడటంతో ఆమెను నేరుగా కలవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఆ అమ్మాయి మైనర్ అన్న విషయం అతనికి తెలియదు. అనుకున్నదే తడవుగా గత ఆదివారం ఆమ్‌స్టర్‌డామ్‌లో విమానం ఎక్కి సోమవారం కోల్‌కతా విమానాశ్రయంలో దిగాడు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాడియా జిల్లాలోని మాయాపూర్‌కు చేరుకుని ఓ హోటల్‌లో గది తీసుకున్నాడు.

ఆ తర్వాత బస్సులో తెహట్టాకు బయలుదేరాడు. స్నేహితురాలి కచ్చితమైన చిరునామా తెలియకపోవడంతో, ఆమె చదివే హైస్కూల్ సమీపంలో సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పచార్లు కొట్టడం ప్రారంభించాడు. సుమారు ఐదు నుంచి ఆరు గంటల పాటు అదే ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతూ స్నేహితురాలి కోసం ఎదురుచూశాడు. తెహట్టా ఒక గ్రామీణ ప్రాంతం కావడం, అక్కడ సాధారణంగా విదేశీయుల సంచారం లేకపోవడంతో, గంటల తరబడి అక్కడే ఉన్న హెన్రిక్స్‌ను చూసి స్థానికులకు అనుమానం కలిగింది. వారు వెంటనే ఈ విషయాన్ని తెహట్టా పోలీస్ స్టేషన్‌కు తెలియజేశారు.

పోలీసుల జోక్యం.. విచారణ
అదే సమయంలో ఓ విదేశీయుడు తన ఇంటి పరిసరాల్లో తిరుగుతున్నాడని గమనించిన ఆ మైనర్ బాలిక తండ్రి కూడా పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి హెన్రిక్స్‌ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్ ఇన్‌ఛార్జ్, ఇన్‌స్పెక్టర్ అభిజిత్ బిస్వాస్ అతడిని విచారించారు. హెన్రిక్స్ తన పాస్‌పోర్ట్, వీసా సహా అన్ని సరైన పత్రాలను పోలీసులకు చూపించాడు. తాను వచ్చిన కారణాన్ని వివరించి, తన స్నేహితురాలి సోషల్ మీడియా ప్రొఫైల్‌ను కూడా వారికి చూపించాడు.

పోలీసులు మాట్లాడుతూ "విచారణలో అతడి వద్ద అనుమానాస్పదంగా ఏమీ లభించలేదు. ఒక విదేశీ పౌరుడిగా అతడికి పూర్తి గౌరవం ఇచ్చాం. కానీ, ఆ అమ్మాయి మైనర్ కావడం, ఆమె తండ్రి కలవడానికి ఇష్టపడకపోవడంతో మేం కూడా సాయం చేయలేకపోయాం. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక అతడిని గౌరవంగా పంపించేశాం" అని తెలిపారు.

భారత్‌కు మళ్లీ రాను
ఈ పరిణామంతో హెన్రిక్స్ తీవ్రంగా నొచ్చుకున్నాడు. "నాకు ఎలాంటి ప్రచారం అవసరం లేదు. కేవలం నా స్నేహితురాలిని కలవాలనుకున్నాను. కానీ అంతా నాశనమైంది. ఇకపై భారత్‌కు వచ్చే ఆలోచనే లేదు. ఇక్కడ నాకు స్వాగతం లభించలేదు, గౌరవం దక్కలేదు. నన్ను తీవ్రంగా అవమానించారు. తెహట్టా ప్రజలు పర్యవసానాల గురించి ఆలోచించకుండా కఠినంగా ప్రవర్తించారు. విదేశీయులందరి పట్ల ఇలాగే వ్యవహరిస్తే భారతదేశం భవిష్యత్తులో ముందుకు వెళ్లలేదు" అని ఇండియా టుడేతో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేశాడు.
Henrik
Dutch national
West Bengal
Nadia district
Social media friend
Tehatta
India travel
Minor girl
Police investigation
Mayapur

More Telugu News