Elon Musk: ఈ ముప్పు నుంచి బయటపడాలంటే... కనీసం ముగ్గురు పిల్లల్ని కనండి: ఎలాన్ మస్క్

Elon Musk Warns of Population Collapse Urges at Least Three Children
  • జననాల రేటు తగ్గడం మానవాళికి పెను ముప్పన్న మస్క్
  • జనాభా స్థిరత్వానికి 2.7 సంతానోత్పత్తి రేటు అవసరమని తాజా అంచనా
  • గతంలో నాగరికతల పతనానికి ఇదే కారణమని వ్యాఖ్య
  • భారత్‌లో సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయిందని ఐరాస నివేదిక
టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రపంచం జనాభా సంక్షోభం దిశగా పయనిస్తోందని, వేగంగా పడిపోతున్న జననాల రేటు మానవాళి మనుగడకే పెను ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను ఎక్కువగా కనడం ద్వారానే ఈ ప్రమాదం నుంచి బయటపడగలమని ఆయన పిలుపునిచ్చారు.

ఎక్స్ వేదికగా ఓ వినియోగదారు చేసిన పోస్టుకు మస్క్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫార్చ్యూన్ నివేదికను ఉటంకిస్తూ.. జనాభా స్థిరంగా కొనసాగాలంటే ఒక మహిళకు సగటున 2.1 మంది పిల్లలు సరిపోరని, ఆ సంఖ్య 2.7గా ఉండాలని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారని ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ రేటు 1.66గా ఉండగా, ఇటలీలో 1.29, జపాన్‌లో 1.3గా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లలు లేనివారు, లింగ అసమతుల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త సంఖ్యను నిర్ధారించినట్లు తెలిపారు.

ఈ పోస్టును రీపోస్ట్ చేసిన మస్క్ "పిల్లలు లేనివారు లేదా ఒక్కరే బిడ్డ ఉన్నవారి లోటును భర్తీ చేయాలంటే, పిల్లలు ఉన్నవారు కచ్చితంగా ముగ్గురిని కనాలి. లేకపోతే జనాభా సంఖ్య భారీగా తగ్గిపోతుంది" అని వ్యాఖ్యానించారు. తన మాటలను ఇప్పుడు నమ్మకపోయినా, 20 ఏళ్లలో నిజం తెలుస్తుందని ఆయన హెచ్చరించారు.

నాగరికతల పతనంతో పోలిక
జననాల రేటు తగ్గడానికి, గతంలో నాగరికతలు అంతరించిపోవడానికి మధ్య బలమైన సంబంధం ఉందని మస్క్ ఎప్పటినుంచో వాదిస్తున్నారు. "పురాతన రోమ్ పతనానికి తక్కువ జననాల రేటే ప్రధాన కారణం. కానీ చాలా మంది చరిత్రకారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు" అని ఆయన గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మస్క్‌కు ప్రస్తుతం 14 మంది సంతానం ఉండటం గమనార్హం.

భారత్‌లోనూ అదే పరిస్థితి
మస్క్ ఆందోళనలకు బలం చేకూరుస్తూ ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్‌ఎఫ్‌పీఏ) నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేట్లు గణనీయంగా తగ్గుతున్నాయని 'ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్' పేరుతో విడుదలైన 2025 ప్రపంచ జనాభా నివేదికలో వెల్లడించింది. పిల్లల పెంపకం ఖర్చు విపరీతంగా పెరగడం, సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో జాప్యం వంటి కారణాలతో చాలా మంది కోరుకున్నంత మంది పిల్లలను కనలేకపోతున్నారని పేర్కొంది.

ఈ నివేదికలో భారత్‌కు సంబంధించిన ఆందోళనకరమైన విషయాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 1.9కి పడిపోయిందని, ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే తక్కువని యూఎన్‌ఎఫ్‌పీఏ స్పష్టం చేసింది. "విద్యావకాశాలు మెరుగుపడటం, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి రావడం వల్ల 1970లో 5గా ఉన్న సంతానోత్పత్తి రేటు నేడు 2కి తగ్గింది. ఇది గొప్ప ప్రగతే అయినప్పటికీ, తగ్గుతున్న రేటు భవిష్యత్తులో సవాళ్లను విసరనుంది" అని యూఎన్‌ఎఫ్‌పీఏ ఇండియా ప్రతినిధి ఆండ్రియా ఎం వోజ్నార్ తెలిపారు.
Elon Musk
population collapse
birth rate
fertility crisis
UNFPA
fertility rate India
population decline
falling birthrates
global population
fertility challenges

More Telugu News