ICC: టీ20 క్రికెట్‌లో కొత్త రూల్స్.. పవర్‌ప్లేకు పక్కా లెక్క..!

ICC Announces New T20 Powerplay Rules and Stop Clock for Tests
  • టీ20, టెస్ట్ క్రికెట్‌లో కొత్త నిబంధనలు ప్రకటించిన ఐసీసీ
  • వర్షం వల్ల కుదించిన టీ20 మ్యాచ్‌లకు కొత్త పవర్‌ప్లే లెక్కలు
  • ఇకపై పాయింట్లలోనూ పవర్‌ప్లే ఓవర్ల లెక్కింపు
  • టెస్టుల్లో స్లో ఓవర్ రేట్‌ను అరికట్టేందుకు స్టాప్ క్లాక్ విధానం
  • జూలై నుంచి అమల్లోకి రానున్న టీ20 నిబంధనలు
ఐసీసీ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. టీ20, టెస్ట్ ఫార్మాట్లలో ఆటను మరింత పారదర్శకంగా, వేగంగా మార్చేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా వర్షం లేదా ఇతర కారణాలతో ఓవర్లను కుదించిన టీ20 మ్యాచ్‌లకు సంబంధించి పవర్‌ప్లే ఓవర్లపై స్పష్టతనిచ్చింది. అలాగే టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ సమస్యను అరికట్టేందుకు స్టాప్ క్లాక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

టీ20ల్లో మారిన పవర్‌ప్లే లెక్కలు
ఇకపై కుదించిన టీ20 మ్యాచ్‌లలో పవర్‌ప్లే ఓవర్లను రౌండ్ ఫిగర్ కాకుండా, కచ్చితమైన లెక్కల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇప్పటివరకు 8 ఓవర్ల మ్యాచ్‌కు మూడు ఓవర్ల పవర్‌ప్లే ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం 8 ఓవర్ల ఇన్నింగ్స్‌లో 2.2 ఓవర్లు మాత్రమే పవర్‌ప్లేగా ఉంటుంది. ఈ సమయంలో 30 గ‌జాల సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ మార్పుల వల్ల మ్యాచ్ నిడివి ఎంత ఉన్నా, ఫీల్డింగ్ పరిమితుల విషయంలో అన్ని జట్లకు సమాన అవకాశాలు లభిస్తాయని ఐసీసీ భావిస్తోంది. ఈ కొత్త పవర్‌ప్లే నిబంధనలు జూలై నుంచి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు వర్తిస్తాయని ఐసీసీ స్పష్టం చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం వివిధ ఓవర్ల మ్యాచ్‌లకు పవర్‌ప్లే ఇలా..
5 ఓవర్ల మ్యాచ్‌కు: 1.3 ఓవర్లు
6 ఓవర్ల మ్యాచ్‌కు: 1.5 ఓవర్లు
10 ఓవర్ల మ్యాచ్‌కు: 3.0 ఓవర్లు
12 ఓవర్ల మ్యాచ్‌కు: 3.4 ఓవర్లు
16 ఓవర్ల మ్యాచ్‌కు: 4.5 ఓవర్లు

టెస్టుల్లో స్లో ఓవర్ రేట్‌కు ‘స్టాప్ క్లాక్’తో చెక్
సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్‌లో జట్లు తరచూ స్లో ఓవర్ రేట్‌తో సమయాన్ని వృథా చేస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఐసీసీ కఠిన చర్యలు చేపట్టింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటికే విజయవంతమైన ‘స్టాప్ క్లాక్’ విధానాన్ని ఇప్పుడు టెస్టుల్లోనూ ప్రవేశపెట్టింది. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ నుంచే ఇది అమల్లోకి వచ్చింది.

ఈ నిబంధన ప్రకారం ఒక ఓవర్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ జట్టు 60 సెకన్లలోపు తర్వాతి ఓవర్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి. మైదానంలో 0 నుంచి 60 వరకు లెక్కించే ఎలక్ట్రానిక్ క్లాక్‌ను ఏర్పాటు చేస్తారు. "ప్రతి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు ఫీల్డింగ్ జట్టు తర్వాతి ఓవర్ ప్రారంభానికి సిద్ధంగా ఉండాలి" అని ఐసీసీ తన ప్లేయింగ్ కండిషన్స్‌లో పేర్కొంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఫీల్డింగ్ జట్టుకు రెండుసార్లు హెచ్చరికలు జారీ చేస్తారు. మూడోసారి కూడా ఆలస్యం చేస్తే, బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీగా లభిస్తాయి. ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లు పూర్తయ్యాక ఈ హెచ్చరికలు రీసెట్ అవుతాయి.

అంతేగాక‌ బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీస్తే, తర్వాతి బంతికి ఎవరు స్ట్రైక్ తీసుకోవాలో నిర్ణయించుకునే హక్కును ఫీల్డింగ్ కెప్టెన్‌కు కల్పించారు. గాలేలో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమైన టెస్ట్ సిరీస్‌తో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
ICC
ICC T20 rules
T20 cricket
Test cricket
Stop clock
Slow over rate
Powerplay overs
WTC
World Test Championship
Cricket rules

More Telugu News