Chandrababu: విజయవాడలో టూరిజం సదస్సు.. క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు

Chandrababu Naidu Inaugurates Tourism Conclave Caravans in Vijayawada
  • విజయవాడలో ఘనంగా టూరిజం కాన్‌క్లేవ్‌ ప్రారంభం
  • రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం
  • బాబా రామ్‌దేవ్‌తో కలిసి క్యారవాన్లను ప్రారంభించిన సీఎం 
  • టూరిజం రంగంలో రూ. 10,039 కోట్ల విలువైన ఒప్పందాలకు రంగం సిద్ధం
  • విశాఖ, అమరావతి, తిరుపతిలో కొత్త హోటళ్ల నిర్మాణానికి ఒప్పందాలు
ఏపీలో పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా విజయవాడలో ఈ రోజు టూరిజం కాన్‌క్లేవ్‌ను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు.

ఈ సదస్సులో ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు పర్యాటక క్యారవాన్లను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ కాన్‌క్లేవ్‌ ముఖ్య ఉద్దేశం. పెట్టుబడులను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించింది. ఈ నిర్ణయం ద్వారా పర్యాటక రంగంలో పరిశ్రమలకు లభించే అన్ని రకాల ప్రోత్సాహకాలు, రాయితీలు వర్తించనున్నాయి.

ఈ సదస్సు వేదికగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) సుమారు రూ. 10,039 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకోనుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో భారీ హోటళ్ల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


Chandrababu
Andhra Pradesh Tourism
Tourism Conclave
Baba Ramdev
Vijayawada
AP Tourism Development Corporation
Investment Agreements
Kandula Durgesh
Kesineni Srinivas
Tourism Caravans

More Telugu News