Jagannath Rath Yatra: గుజరాత్ లో... జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌లో అప‌శ్రుతి

Jagannath Rath Yatra Elephant Scare in Ahmedabad
  • అదుపుతప్పిన మూడు ఏనుగులు
  • భక్తులపైకి దూసుకెళ్లడంతో తీవ్ర గందరగోళం
  • ప్రాణభయంతో పరుగులు తీసిన జనం
  • తోపులాటలో పలువురు భక్తులకు గాయాలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో ఈ రోజు ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది. ఊరేగింపులో భాగమైన ఏనుగులు ఒక్కసారిగా అదుపుతప్పి జనంలోకి దూసుకురావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే... శుక్రవారం ఉదయం 10:15 గంటల సమయంలో రథయాత్ర అహ్మదాబాద్‌లోని ఖాదియా ప్రాంతానికి చేరుకుంది. ఈ క్రమంలో ఊరేగింపు ముందు భాగంలో ఉన్న మూడు ఏనుగులు హఠాత్తుగా బెదిరి భక్తుల సమూహంపైకి దూసుకొచ్చాయి. ఊహించని ఈ పరిణామంతో భయాందోళనకు గురైన భ‌క్తులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో తోపులాట జరిగి, కొందరు భక్తులు కిందపడి గాయపడ్డారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆలయ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే ఏనుగులను శాంతింపజేసి, జనసమూహాన్ని క్రమబద్ధీకరించారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. అనంతరం రథయాత్రను తిరిగి కొనసాగించారు.

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ రథయాత్ర సుమారు 16 కిలోమీటర్ల మేర సాగుతుంది. దీనిని వీక్షించేందుకు దాదాపు 15 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా. ఈ నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరవ్యాప్తంగా 23,800 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ ఏడాది తొలిసారిగా ఆలయ పరిసరాల్లో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.
Jagannath Rath Yatra
Ahmedabad
Gujarat
Rath Yatra accident
Elephant rampage
Temple festival
Indian festival
AI surveillance
Khadia
Devotees

More Telugu News