Baba Ramdev: బాబా రామ్‌దేవ్‌ కు ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర ఆఫర్

Chandrababu Invites Baba Ramdev as AP Tourism Advisor
  • విజయవాడలో జరిగిన టూరిజం కాంక్లేవ్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు
  • యోగా దినోత్సవం నిర్వహణలో గిన్నిస్ రికార్డు సాధించామని వెల్లడి
  • ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ సైతం ప్రశంసించారని వెల్లడి
  • పర్యాటక శాఖకు సలహాదారుగా వ్యవహరించాలని బాబా రామ్‌దేవ్‌కు విజ్ఞప్తి
  • రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టీకరణ
  • ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తామని హామీ
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, ప్రముఖ యోగా గురువు, ఆధ్యాత్మికవేత్త బాబా రామ్‌దేవ్‌ సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. రాష్ట్ర పర్యాటక శాఖకు సలహాదారుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు... బాబా రామ్‌దేవ్‌ను కోరారు. విజయవాడలో జరిగిన టూరిజం కాంక్లేవ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను బాబా రాందేవ్ ముందుంచారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక రంగంలో ఉంటూనే బాబా రామ్‌దేవ్ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని ప్రశంసించారు. ఆయన అనుభవం, సలహాలు రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, దీనికి మరింత ఊతం ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు.

ఇటీవల నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్రమంపై కూడా చంద్రబాబు మాట్లాడారు. యోగా డే నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుందని ఆయన సగర్వంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

పరిపాలనలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో, ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్‌లైన్ ద్వారానే అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
Baba Ramdev
Andhra Pradesh Tourism
Chandrababu Naidu
Tourism Advisor
Yoga Day
AP Tourism Development
Tourism Conclave Vijayawada
Online Government Services
Narendra Modi
Guinness World Record

More Telugu News