S Jaishankar: కుర్చీ కోసం ఆ కుటుంబం ఎంతకైనా తెగిస్తుంది: జైశంకర్ తీవ్ర విమర్శలు

S Jaishankar Slams Congress Over Emergency Era
  • ఒక కుటుంబం కోసం దేశంలో ఎమర్జెన్సీ విధించారని జైశంకర్ విమర్శ
  • కుర్చీ కాపాడుకోవడానికే కాంగ్రెస్ ఈ చర్యకు పాల్పడిందని ఆరోపణ
  • ఎమర్జెన్సీ సమయంలో లక్షన్నర మందిని జైళ్లలో పెట్టారని వెల్లడి
  • తాము చేసిన తప్పులకు కాంగ్రెస్ ఎన్నడూ పశ్చాత్తాపం చూపలేదని వ్యాఖ్య
  • ఎమర్జెన్సీ రికార్డులను భద్రపరచాలని అధికారులకు ప్రధాని మోదీ ఆదేశం
దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించడానికి ఒకే ఒక కుటుంబం కారణమని, అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ప్రజల ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగిందని గుర్తుచేశారు.

కుర్చీ కాపాడుకోవడానికే

నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెరిగిపోయిన అవినీతి, అధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజాదరణ లేకుండా పోయిందని జైశంకర్ అన్నారు. ఈ పరిస్థితుల్లో తమ అధికారాన్ని, కుర్చీని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని అస్త్రంగా వాడుకుందని ఆయన ఆరోపించారు. "అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లిందనే కారణంతో 1975 జూన్ 25న నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీని ప్రకటించారు. కానీ అసలు కారణం అధికారాన్ని నిలబెట్టుకోవడమే" అని జైశంకర్ పేర్కొన్నారు. స్వేచ్ఛను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదనే గుణపాఠాన్ని ఎమర్జెన్సీ మనకు నేర్పిందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగ విలువలు గాలికొదిలేశారు

ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువలను పూర్తిగా పక్కనపెట్టిందని జైశంకర్ విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసి, పత్రికా స్వేచ్ఛను అణచివేశారని అన్నారు. ఆ చీకటి రోజుల్లో దాదాపు లక్షన్నర మందిని ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించారని ఆయన తెలిపారు. అందుకే జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్య దివస్'గా పాటిస్తున్నామని స్పష్టం చేశారు.

"కొంతమంది నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. కానీ వారి అసలు ఉద్దేశాలు రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి" అని పరోక్షంగా విమర్శించారు. తాము చేసిన చారిత్రక తప్పులపై కాంగ్రెస్ నేతలు ఎన్నడూ విచారం వ్యక్తం చేయలేదని, తమ నిర్ణయాలు తప్పని అంగీకరించే ధైర్యం వారికి లేదని జైశంకర్ దుయ్యబట్టారు.
S Jaishankar
Emergency India
Indian Emergency
Congress Party
Indira Gandhi

More Telugu News