Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్ విచారణ ఏమైనా డైలీ సీరియలా?: ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం

Raghunandan Rao Criticizes Phone Tapping Investigation as Daily Serial
  • దుబ్బాక నుంచే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభం
  • మొట్టమొదట తన ఫోనే ట్యాప్ అయిందని వెల్లడి
  • సిట్ దర్యాప్తు ఓ డైలీ సీరియల్ అంటూ విమర్శ
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపణ
  • అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై తీవ్ర ఆగ్రహం
  • ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చారంటూ ఆగ్రహం
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ దర్యాప్తు ఒక డైలీ సీరియల్‌లా సాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ దుబ్బాక ఉపఎన్నికతోనే ప్రారంభమైందని, తాను మొదటి బాధితుడినని తెలిపారు.

"దుబ్బాక ఉపఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పుడే డీజీపీకి ఫిర్యాదు చేశాను. కానీ ఇప్పటివరకు నా నుంచి వివరాలు తీసుకోలేదు. ఫిర్యాదు చేసిన నన్ను కాదని, సంబంధం లేని వ్యక్తులను సిట్ విచారణకు పిలుస్తోంది. మమ్మల్ని అడిగితే అన్ని ఆధారాలు ఇచ్చేవాళ్ళం కదా?" అని రఘునందన్ ప్రశ్నించారు. ఈ కేసు విచారణలో చివరికి గాడిద గుడ్డు తప్ప ఏమీ తేలదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని రఘునందన్ రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా పాలన సాగిస్తోందని మండిపడ్డారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేస్తే నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు సమాచారం ఇస్తే భద్రత కల్పిస్తామని పోలీసులు చెప్పారని ఆయన తెలిపారు.

పథకాల పేర్లు మార్చడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును 'ఇందిరమ్మ'గా మార్చడం దౌర్భాగ్యమని అన్నారు. "ఇందిరమ్మ పేరు చెబితే ఎమర్జెన్సీ గుర్తుకు వస్తుందనే కనీస ఇంగితజ్ఞానం కూడా కాంగ్రెస్ నేతలకు లేదు. మేయర్ ఇప్పటికైనా పేర్లు మార్చడంపై కాకుండా నగరంలో కుక్కల బెడద వంటి సమస్యలపై దృష్టి పెట్టాలి" అని హితవు పలికారు. ఇందిరమ్మ ఇళ్ళు కూడా అర్హులైన పేదలకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనైనా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారని నిరూపించాలని సవాల్ విసిరారు.

బీఆర్ఎస్‌పైనా విమర్శనాస్త్రాలు

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత కవితపై కూడా రఘునందన్ రావు స్పందించారు. "కవిత బీసీనా? పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా? పార్టీ అధ్యక్ష పదవి, శాసనసభాపక్ష నేత పదవి బీసీలకు ఇవ్వకుండా ఇప్పుడు బీసీ ఉద్యమం చేస్తామంటే ఎలా?" అని ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్లు తొలగిస్తే రాజ్యాంగ సవరణకు తాము సిద్ధంగా ఉన్నామని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
Raghunandan Rao
Telangana
Phone Tapping Case
BRS
Congress
Revanth Reddy
Dubbaka By Election
Kavitha
GHMC
Indiramma Canteens

More Telugu News