Anand Niketan: ఇది వృద్ధాశ్రమమా?... నరకమా?

Anand Niketan Old Age Home Torture Uncovered in Noida
  • నోయిడాలోని ఆనంద్‌ నికేతన్‌ వృద్ధాశ్రమంపై అధికారుల దాడులు
  • వృద్ధులను బంధించి, అపరిశుభ్ర వాతావరణంలో ఉంచిన వైనం
  • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో వెలుగులోకి దారుణం
  • 30 ఏళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండానే ఆశ్రమం నిర్వహణ
  • 42 మంది వృద్ధులను రక్షించి, ప్రభుత్వ కేంద్రానికి తరలింపు
  • చేర్చుకోవడానికి రూ. 2.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు
ఆదరణ కరువై, చివరి దశలో ఆసరా కోసం వృద్ధాశ్రమాలకు వచ్చే అభాగ్యులకు నరకం చూపిస్తున్న ఓ ముఠా దారుణం నోయిడాలో వెలుగు చూసింది. ఆనంద నికేతన్ పేరుతో నడుపుతున్న ఓ వృద్ధాశ్రమంలో వృద్ధులను చిత్రహింసలకు గురిచేస్తున్న విషయం బయటపడటంతో అధికారులు కంగుతిన్నారు. కొందరిని గదుల్లో బంధించి, మరికొందరి చేతులు కట్టేసి అమానుషంగా ప్రవర్తిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. దాడులు నిర్వహించిన అధికారులు అక్కడ నెలకొన్న దయనీయ పరిస్థితులను చూసి చలించిపోయారు.

సోషల్ మీడియాతో బట్టబయలు

నోయిడా సెక్టార్ 55లోని సీ-5 బ్లాక్‌లో ఆనంద నికేతన్ పేరుతో చాలాకాలంగా ఓ వృద్ధాశ్రమం నడుస్తోంది. అయితే, ఇక్కడి వృద్ధుల పట్ల నిర్వాహకులు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆశ్రమంలోని దయనీయ పరిస్థితులను చూపే కొన్ని ఫొటోలు, వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన నోయిడా పోలీసులు, ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్, రాష్ట్ర సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా ఆశ్రమంపై మెరుపు దాడులు చేశారు.

 బేస్‌మెంట్‌లో నిర్బంధం, చేతులకు కట్లు

అధికారులు ఆశ్రమంలోకి ప్రవేశించి చూడగా అక్కడి దృశ్యాలు వారిని విస్తుపోయేలా చేశాయి. ఓ మహిళ చేతులను వెనక్కి విరిచి కట్టేసి ఉండగా, పలువురు పురుషులను బేస్‌మెంట్‌లోని గదుల్లో నిర్బంధించి ఉంచారు. చాలామందికి ఒంటిపై సరైన దుస్తులు కూడా లేవు. మలమూత్రాలతో తడిసిన బట్టలతోనే వారంతా కాలం వెళ్లదీస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై అక్కడి నిర్వాహకుడిని ప్రశ్నించగా, అతడి నుంచి సరైన సమాధానం రాలేదు.

30 ఏళ్లుగా అనుమతుల్లేకుండానే...!

విచారణలో మరో విస్తుపోయే నిజం బయటపడింది. గడిచిన 30 ఏళ్లుగా ఈ ఆశ్రమాన్ని ఎలాంటి రిజిస్ట్రేషన్, ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు తేలింది. అక్రమంగా నిర్వహిస్తున్న ఈ కేంద్రాన్ని వెంటనే సీజ్ చేస్తున్నట్లు మహిళా కమిషన్ సభ్యులు ప్రకటించారు. ఇక్కడున్న 42 మంది వృద్ధులను రక్షించి, వారిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంరక్షణ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో వ్యక్తిని ఆశ్రమంలో చేర్చుకునేందుకు నిర్వాహకులు రూ. 2.5 లక్షలు వసూలు చేయడంతో పాటు, నెలవారీ ఖర్చులు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చేరిన వారిలో చాలామంది నోయిడాలోని ఉన్నత కుటుంబాలకు చెందిన వారేనని తెలిసింది. 
Anand Niketan
Noida
old age home
old age
elderly abuse
human rights violation
Uttar Pradesh
old age home scandal
illegal old age home
social media

More Telugu News