Konda Vishweshwar Reddy: భయంతో రెండు వారాలు బెంగళూరులో తలదాచుకున్నా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Konda Vishweshwar Reddy Alleges Phone Tapping by KCR and KTR
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • కేసీఆర్, కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు, సంచలన విషయాల వెల్లడి
  • గత ప్రభుత్వ హయాంలో తనను, తన కుటుంబాన్ని వేధించారని వాంగ్మూలం
తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈరోజు సిట్ అధికారుల ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. గంటన్నరకు పైగా సాగిన విచారణ అనంతరం ఆయన బయటకు వచ్చి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పాలనలో తనకు ఎదురైన వేధింపుల కారణంగా, ఉద్యమకారుడినైన తానే భయపడి రెండు వారాల పాటు బెంగళూరులో తలదాచుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ సందర్భంగా సిట్ అధికారులు తనకు కొన్ని కీలక ఆధారాలను చూపించారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. గతంలో తాను జితేందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణను అప్పటి అధికారి ప్రణీత్ రావు రికార్డ్ చేశారని, ఆ ఆడియో క్లిప్‌ను సిట్ అధికారులు తనకు వినిపించారని ఆయన వెల్లడించారు. కొన్ని ఫోన్ కాల్స్‌ను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారని ఆరోపించారు. కేవలం తమ పదవులను కాపాడుకోవడం కోసమే కేసీఆర్, కేటీఆర్ ఇంత నీచమైన ఫోన్ ట్యాపింగ్ చర్యలకు పాల్పడ్డారని, వారికి చట్టంపైన గానీ, వ్యక్తుల గోప్యతపైన గానీ ఏమాత్రం గౌరవం లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గత ఎన్నికల సమయంలో తనపై జరిగిన వేధింపులను కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. "ఎన్నికల సమయంలో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు నా ఇంట్లోకి చొరబడి కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేశారు. ఎందుకు తనిఖీ చేస్తున్నారని ప్రశ్నించినందుకు, నాపైనే రివర్స్‌లో దాడి చేశానంటూ కేసు బనాయించారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. నాపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టి, ఎన్నికల తర్వాత అరెస్టు చేయాలని కుట్ర పన్నారు" అని ఆయన వివరించారు.

అప్పటి డీజీపీనే తనను అరెస్టు చేస్తారని చెప్పడంతో, భయంతో రెండు వారాల పాటు బెంగళూరులో తలదాచుకోవాల్సి వచ్చిందని కొండా తెలిపారు. "ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న నాకే ఈ పరిస్థితి ఎదురైంది. నా కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. నన్ను కలవడానికి వస్తున్న నా భార్య ఫోన్‌ను సైతం ట్యాప్ చేసి, ఆమెను ఫాలో చేశారు" అని ఆయన ఆరోపించారు. 2018 ఎన్నికల్లో ఓడిపోతామని ముందే గ్రహించిన కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరింపులకు పాల్పడి గెలిచారని అన్నారు. ఇక భవిష్యత్తులో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రారని జోస్యం చెప్పారు. సిట్ దర్యాప్తు సక్రమంగా జరగని పక్షంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
Konda Vishweshwar Reddy
Telangana phone tapping case
BRS
KCR
KTR
Jitender Reddy
Praneeth Rao
SIT investigation
Bangalore
election harassment

More Telugu News