Vemuru Ravikumar: ఏపీఎన్ఆర్‌టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమూరు రవికుమార్

Vemuru Ravikumar Takes Charge as APNRT President
  • ప్రవాసాంధ్రుల అభ్యున్నతే ప్రధాన లక్ష్యమన్న రవికుమార్
  • రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలను భాగస్వాములను చేస్తామని వెల్లడి
  • విదేశాల్లోని తెలుగు విద్యార్థులకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి
  • అమరావతిలో ఎన్నారై ఐకానిక్ టవర్‌ రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ
  • సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ల మార్గనిర్దేశంలో పనిచేస్తానని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ఏపీ నాన్-రెసిడెంట్ తెలుగు (ఏపీఎన్ఆర్‌టీ) సొసైటీ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ వేమూరు రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని సంస్థ కార్యాలయంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు వాళ్లు ఎక్కడున్నా నెంబర్ వన్ గా ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ల లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్నారైలను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయడమే తమ ప్రధాన లక్ష్యమని రవికుమార్ తెలిపారు. కేవలం ఉద్యోగులుగానే ఉన్న ప్రవాసులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళతామన్నారు. విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో శిక్షణా కార్యక్రమాలు చేపడతామని వివరించారు. వివిధ దేశాల్లోని ప్రభుత్వ కో-ఆర్డినేటర్లతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

అమరావతిలో రూ.950 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఎన్నారై ఐకానిక్ టవర్ నిర్మాణాన్ని రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామని వేమూరు రవికుమార్ హామీ ఇచ్చారు. ప్రవాసాంధ్రులకు భరోసా కల్పించేందుకు ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాలను అందుబాటులోకి తెస్తామని, దీనికి ఏపీఎన్ఆర్‌టీ ఒక వారధిగా పనిచేస్తుందని అన్నారు. విదేశాల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించేందుకు శ్రీవారి కల్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నారైల పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీఎన్ఆర్‌టీ కీలక వేదికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఎన్నారై వ్యవహారాలపై మంచి పట్టున్న రవికుమార్ నియామకం శుభపరిణామమని, ఆయనకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో  టీడీపీ ఎమ్మెల్యేలు ఆనందబాబు, ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య,  బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు బుచ్చిరామ్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఏపీ లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు, ఏపీ ఎడ్యుకేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజశేఖర్, ఏపీస్ఎస్డీసీ ఎండీ గణేశ్ కుమార్, ఏపీఎన్ఆర్టీ సొసైటీ సీఈవో హేమలత రాణి, ఏపీ ఎన్ఆర్టీఎస్ డైరెక్టర్లు శేషుబాబు కానూరి, శాంతి, ఎన్నారై టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ రవి, ఎన్నారై టీడీపీ కువైట్ విభాగం అధ్యక్షుడు నాగేంద్ర బాబు అక్కిలి, ఎన్నారై మురళీ రాపాకతో పాటు పలువురు ఎన్నారైలు, నాయకులు పాల్గొన్నారు.
Vemuru Ravikumar
APNRT
Andhra Pradesh
Non Resident Telugu
Nara Lokesh
Chandrababu Naidu
NRI investments
Skill development
Amaravati
NRI Iconic Tower

More Telugu News