Iran: ఇజ్రాయెల్‍తో ఉద్రిక్తతలు.. గగనతలం మూసివేతను పొడిగించిన ఇరాన్

Iran Extends Airspace Closure Amid Tensions With Israel
  • ఇరాన్ గగనతలం పునఃప్రారంభం మరోసారి వాయిదా
  • శనివారం మధ్యాహ్నం వరకు విమానాల రాకపోకలు నిలిపివేత
  • ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
  • ఇజ్రాయెల్‍తో 12 రోజుల ఘర్షణ నేపథ్యంలో ఈ పరిణామం
  • ఇరాన్ అణు కేంద్రాలను దెబ్బతీశామన్న ఇజ్రాయెల్ రక్షణ దళాలు
  • ఇజ్రాయెల్, అమెరికాపై తామే గెలిచామన్న ఖమేనీ
ఇజ్రాయెల్‍తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ గగనతలాన్ని పూర్తిస్థాయిలో పునఃప్రారంభించే నిర్ణయాన్ని శనివారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. దేశంలోని ఉత్తర, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల గగనతలంపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

విమాన ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ రోడ్లు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజిద్ అఖవాన్ తెలిపారు. ఇప్పటికే దేశ తూర్పు గగనతలాన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం తెరిచామని, మిగిలిన గగనతలాన్ని శనివారం వరకు మూసివేస్తున్నామని ఆయన వెల్లడించారు. దశలవారీగా విమాన గగనతలాన్ని ఘర్షణలకు ముందున్న స్థాయికి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

జూన్ 13న ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్ సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులు జరపడంతో ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఇరు దేశాల మధ్య 12 రోజుల పాటు తీవ్ర వైమానిక ఘర్షణలు కొనసాగాయి. అనంతరం మంగళవారం ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 

మరోవైపు, ఇరాన్‌పై జరిపిన 12 రోజుల సైనిక చర్యలో ఆ దేశ అణు కార్యక్రమానికి భారీ నష్టం కలిగించామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ప్రకటించాయి. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికాపై తామే గెలిచామని ఇరాన్ సుప్రీంనేత ఆయతుల్లా ఖమేనీ ప్రకటించుకోవడం గమనార్హం.
Iran
Israel Iran conflict
Iran airspace closure
Israel
Middle East tensions
Tehran

More Telugu News