Narendra Modi: మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ... వివరాలు ఇవిగో!

Narendra Modi to Visit Multiple Countries Details Here
  • జులై 2 నుంచి 9వరకు ఐదు దేశాల్లో మోదీ పర్యటన
  • బ్రెజిల్ లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న ప్రధాని మోదీ
  • నమీబియా, ఘనా, ట్రినిడాడ్ , టొబాగో, అర్జెంటీనాలో మోదీ పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల మూడో వారంలో సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాలలో ఐదు రోజుల పర్యటన చేసిన ప్రధాని మోదీ జులై మొదటి వారంలో బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ సౌత్‌లోని అనేక కీలక దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. ఈ దేశాలతో భారత్ సంబంధాలను మరింత విస్తరించేందుకు జులై 2 నుంచి 9 వరకు ఐదు దేశాల్లో పర్యటిస్తారు.

ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బ్రెజిల్‌తో పాటు ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాలను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తొలుత మోదీ ఘనాలో పర్యటిస్తారు. మూడు దశాబ్దాల కాలంలో భారత్ నుంచి ఘనాకు వెళ్తున్న మొదటి ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై చర్చలు జరుగుతాయి.

అనంతరం రెండు రోజులు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తారు. 1999 తర్వాత భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ట్రినిడాడ్, టొబాగో అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూ, ప్రధాన మంత్రి కమ్లా పెర్సాద్ బిస్సేసర్‌తో చర్చలు జరుపుతారు. మోదీ ఈ ద్వీప దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలోనూ ప్రసంగించే అవకాశం ఉంది.

తదుపరి అర్జెంటీనాను ప్రధాని మోదీ సందర్శిస్తారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం మరియు పెట్టుబడి వంటి కీలక రంగాలలో భారత దేశం – అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి అధ్యక్షుడు జేవియర్ మిలేతో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ తెలిపింది.

తర్వాత బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆహ్వానం మేరకు రియో డి జనీరోలో జులై 5 నుంచి 8 వరకు జరిగే 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు. తదుపరి నమీబియా దేశంలో మోదీ పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు నెతుంబో నంది నదిత్వాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నమీబియా పార్లమెంట్‌లోనూ ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. 
Narendra Modi
Modi foreign visit
Brazil BRICS summit
Ghana India relations
Trinidad and Tobago
Argentina India partnership
Namibia Modi visit
Global South tour
Indian Prime Minister
Javier Milei

More Telugu News