YS Jagan: జగన్ వాహనం కండిషన్ ఓకే.. ప్రమాదానికి కారణమదే: ఆర్టీఏ రిపోర్ట్

RTA Key Report on Jagan Vehicle Condition
  • సింగయ్య మృతికి కారణమైన వైఎస్ జగన్ వాహనాన్ని పరిశీలించిన ఆర్టీఏ
  • వాహనంలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేల్చిన అధికారులు
  • బ్రేకులు, ఇంజిన్ కండిషన్‌లో ఉన్నాయని నివేదికలో వెల్లడి
  • మానవ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగిందని స్పష్టీకరణ
  • పోలీసుల దర్యాప్తునకు కీలకం కానున్న ఆర్టీఏ నివేదిక
దళితుడైన చీలి సింగయ్య మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణమైన వైసీపీ అధినేత జగన్‌కు చెందిన వాహనాన్ని రవాణా శాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనంలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని, బ్రేకులు, ఫిట్‌నెస్ అన్నీ సక్రమంగా ఉన్నాయని తేల్చారు. మానవ తప్పిదం వల్లే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసుల అభ్యర్థన మేరకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న ఏపీ40 డీహెచ్ 2349 నంబర్ గల వాహనాన్ని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) గంగాధరప్రసాద్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు. వాహనాన్ని స్వయంగా నడిపి బ్రేకుల పనితీరును పరీక్షించారు. వాహనం కండిషన్ చాలా బాగుందని ఆయన ధ్రువీకరించారు. రికార్డులతో సరిపోల్చేందుకు ఇంజిన్, ఛాసిస్ నంబర్లను కూడా తనిఖీ చేశారు.

ఈ వాహనం 2024లో రిజిస్ట్రేషన్ అయిందని, దీనికి 2027 వరకు బీమా, 2039 వరకు ఫిట్‌నెస్ ఉందని ఎంవీఐ తెలిపారు. రికార్డుల పరంగా అన్నీ సక్రమంగా ఉన్నాయని స్పష్టం చేశారు. "వాహనం ఫిట్‌నెస్‌లో ఎటువంటి సమస్య లేదు. ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగింది" అని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు వాహనం ఎక్కి తొక్కడం వల్ల కొన్నిచోట్ల సొట్టలు పడ్డాయని, ప్రమాదం జరిగిన తర్వాత కూడా అదే వాహనంలో ప్రయాణించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఈ నెల 18న గుంటూరు జిల్లా వెంగళాయపాలేనికి చెందిన సింగయ్య, జగన్ వాహనం కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రైవర్ రమణారెడ్డిని ఏ1గా, జ‌గ‌న్‌ను ఏ2గా చేర్చ‌గా.. ఏ3గా జ‌గ‌న్ వ్యక్తిగ‌త కార్య‌ద‌ర్శి కె. నాగేశ్వ‌ర‌రెడ్డి, ఏ4గా వైవీ సుబ్బారెడ్డి, ఏ5గా పేర్ని నాని, ఏ6గా విడద‌ల ర‌జిని త‌దిత‌రుల‌ను చేర్చారు. అనంతరం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న వాహనాన్ని సీజ్ చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు.

ప్రస్తుతం వాహన తనిఖీకి సంబంధించిన పూర్తి నివేదికను డీఎస్పీ భానోదయకు అందజేయనున్నట్లు ఎంవీఐ గంగాధరప్రసాద్ తెలిపారు. వాహన సామర్థ్యంపై ఆర్టీఏ స్పష్టత ఇవ్వడంతో ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలను తేల్చేందుకు పోలీసుల దర్యాప్తు కొనసాగనుంది.
YS Jagan
Singaiah
Jagan vehicle
Andhra Pradesh
Guntur district
Road accident
Vehicle inspection
RTA report
Police investigation
YS Jagan Mohan Reddy

More Telugu News