Vaibhav Suryavanshi: కోహ్లీ జెర్సీలో సూర్యవంశీ మెరుపులు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా!

Vaibhav Suryavanshi Shines as India U19 Defeats England U19
  • తొలి యూత్ వన్డేలో ఇంగ్లండ్‌పై భారత్ అండర్ 19 జట్టు ఘన విజయం
  • 19 బంతుల్లో 48 పరుగులతో చెలరేగిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ
  • కోహ్లీకి గుర్తుగా ఉండే 18వ నంబర్ జెర్సీతో ఆడిన యువ ఆట‌గాడు
  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన టీమిండియా
  • ఇంగ్లండ్ తరఫున ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ అర్ధశతకం
అండర్ 19 యూత్ వన్డే సిరీస్‌లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. హోవ్‌లో నిన్న‌ జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ అండర్ 19 జట్టుపై 6 వికెట్ల తేడాతో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 48 పరుగులు బాది టీమిండియా విజయానికి బలమైన పునాది వేశాడు. ముఖ్యంగా భార‌త‌ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రసిద్ధి చెందిన 18వ నంబర్ జెర్సీ ధరించి వైభవ్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం విశేషం.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ రేవ్యూ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ (90 బంతుల్లో 56) నిలకడగా ఆడి అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడుగా ఐజాక్ మహమ్మద్ (28 బంతుల్లో 42) వేగంగా పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లండ్ జట్టు 42.2 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయింది.

భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్ అద్భుతంగా రాణించాడు. కేవ‌లం 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, ఆర్ఎస్ అంబరీశ్‌ తలా రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

అనంతరం 175 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని అందించాడు. అతని దూకుడుతో భారత్ కేవలం ఎనిమిది ఓవర్ల‌కే 70 పరుగుల మార్కును దాటింది. భారీ షాట్‌లతో చెలరేగిన వైభవ్, రాల్ఫీ ఆల్బర్ట్ బౌలింగ్‌లో ఎనిమిదో ఓవర్లోనే ఔటయ్యాడు. అయితే, అప్పటికే టీమిండియా విజయానికి బలమైన పునాది వేశాడు. మిగిలిన బ్యాటర్లు లాంఛనాన్ని పూర్తి చేయడంతో భారత జట్టు మరో 26 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లోని రెండో వన్డే జూన్ 30న, మూడో వన్డే జూలై 2న నార్తాంప్టన్‌లో జరగనున్నాయి. ఆ తర్వాత జూలై 5, 7 తేదీల్లో వోర్సెస్టర్‌లో మరో రెండు వన్డేలు, అనంతరం రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి.
Vaibhav Suryavanshi
India Under 19
England Under 19
U19 Youth ODI Series
Kanishk Chouhan
Rocky Flintoff
Cricket
Youth Cricket
India U19 vs England U19

More Telugu News