Donald Trump: ట్రంప్ వ్యాఖ్యలతో దుమారం.. ఇరాన్‌కు కోపం తెప్పించిన ఆ ఒక్క మాట!

Trump Must Stop Disrespectful Tone Against Khamenei If He Wants Deal says Iran
  • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలను తానే కాపాడానన్న ట్రంప్
  • ట్రంప్ వ్యాఖ్యలు అగౌరవమైనవి, ఆమోదయోగ్యం కావన్న‌ ఇరాన్ 
  • ఖమేనీ ఎక్కడున్నారో తెలిసినా దాడి చేయకుండా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాన్ని ఆపింది నేనేనన్న ట్రంప్
  • బెదిరింపులను, అవమానాలను సహించబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టీకరణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అగౌరవమైనవి, ఆమోదయోగ్యం కానివ‌ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ శనివారం తీవ్రంగా ఖండించారు. ఖమేనీని ఒక దారుణమైన మరణం నుంచి తానే కాపాడానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది.

ట్రంప్ ఏమన్నారంటే..!
అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఖమేనీ ఎక్కడ తలదాచుకున్నారో నాకు కచ్చితంగా తెలుసు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా సైన్యం గానీ, ఇజ్రాయెల్ గానీ ఆయన ప్రాణాలు తీయకుండా నేనే అడ్డుపడ్డాను. అత్యంత దారుణమైన, అవమానకరమైన మరణం నుంచి ఆయన్ను కాపాడాను. దీనికి ఆయన నాకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు" అని ట్రంప్ పోస్ట్ చేశారు.

అంతేగాక‌ ఇరాన్ ప్రధాన డిమాండ్లలో ఒకటైన ఆంక్షల తొలగింపుపై తాను గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నానని ట్రంప్ వెల్లడించారు. "కానీ దానికి బదులుగా నాకు ద్వేషం, అసహ్యంతో కూడిన ఆగ్రహపూరిత ప్రకటన ఎదురైంది. దీంతో ఆంక్షల ఉపశమనంపై చేస్తున్న పనులన్నింటినీ తక్షణమే నిలిపివేశాను" అని పేర్కొన్నారు. అలాగే ఇరాన్ చర్చలకు తిరిగి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.

ఘాటుగా స్పందించిన ఇరాన్
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ తీవ్రంగా స్పందించారు. "ఒకవేళ ఒప్పందం చేసుకోవాలనే చిత్తశుద్ధి ట్రంప్‌కు నిజంగా ఉంటే, మా సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పట్ల అగౌరవంగా మాట్లాడటం మానుకోవాలి. ఆయనను ఆరాధించే కోట్లాది మంది మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీయడం ఆపాలి" అని తన 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పోస్ట్ చేశారు.

"మా క్షిపణులకు భయపడి ఇజ్రాయెల్ తమ 'డాడీ' (అమెరికా) వద్దకు పారిపోయేలా చేసిన శక్తిమంతమైన ఇరాన్ ప్రజలు.. ఇలాంటి బెదిరింపులను, అవమానాలను ఏమాత్రం సహించరు" అని అరఘ్చీ హెచ్చరించారు.
Donald Trump
Iran
Ayatollah Ali Khamenei
Iran Nuclear Deal
US Foreign Policy
Iran Supreme Leader
Israel
Abbas Araghchi
Trump Truth Social
Iran Sanctions

More Telugu News