DY Chandrachud: ఆర్కిటెక్ట్ కావాలనుకున్నా.. నాన్న కోసం ఆ కలను వదులుకున్నా: సీజేఐ గవాయ్

Justice Gavai Gets Emotional Remembering Fathers Wishes
నాగ్‌పూర్ బార్ అసోసియేషన్ సభలో భావోద్వేగానికి గురైన సీజేఐ గవాయ్
తాను సీజేఐ అవుతానని నాన్న ముందే చెప్పారని గుర్తుచేసుకుని కన్నీళ్లు
ఈ విజయాన్ని చూసేందుకు నాన్న లేరని ఆవేదన
అమ్మ చూడగలిగినందుకు సంతోషంగా ఉందన్న చీఫ్ జస్టిస్
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ తన తండ్రిని, ఆయన ఆశయాలను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తన తండ్రి నెరవేర్చుకోలేని కలను తాను ఎలా సాకారం చేసిందీ వివరిస్తూ ఆయన కంటతడి పెట్టడంతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.

నాగ్‌పూర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ సభలో జస్టిస్ గవాయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత జీవితంలోని ఓ కీలక ఘట్టాన్ని పంచుకున్నారు. తాను వాస్తవానికి ఆర్కిటెక్ట్ కావాలని కలలు కన్నానని తెలిపారు. న్యాయవాదిగా రాణించాలన్న తన తండ్రి కోరిక మాత్రం నెరవేరలేదని, ఆయన కలను నిజం చేయాలన్న లక్ష్యంతోనే తాను న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టానని వివరిస్తూ జస్టిస్ గవాయ్ భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ క్రమంలో తన తండ్రి చెప్పిన మాటలను ఆయన గుర్తుచేసుకున్నారు. తాను ఏదో ఒక రోజు భారత ప్రధాన న్యాయమూర్తిని అవుతానని నాన్న తరచూ చెప్పేవారని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఆయన మాటలను నిజం చేస్తూ తాను ఈ అత్యున్నత స్థాయికి చేరుకున్నానని, కానీ ఈ విజయాన్ని చూసేందుకు తన తండ్రి ఇప్పుడు జీవించి లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి 2015లోనే కన్నుమూశారని చెబుతూ జస్టిస్ గవాయ్ కంటతడి పెట్టుకున్నారు.

తన తండ్రి అంబేద్కర్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని, సమాజం కోసం ఎన్నో త్యాగాలు చేశారని జస్టిస్ గవాయ్ తెలిపారు. తనను పెంచి పెద్ద చేయడానికి తన తల్లి, అత్త ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తుచేసుకున్నారు. తన తండ్రి ఈ విజయాన్ని చూడలేకపోయినా, తన తల్లి చూస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన మూలాలను, కుటుంబ సభ్యుల త్యాగాలను గుర్తుచేసుకుని సీజేఐ భావోద్వేగానికి గురవ్వడం అక్కడున్న వారిని సైతం కదిలించింది.
DY Chandrachud
CJI Gavai
Justice Gavai
Chief Justice of India
Nagpur
Supreme Court
lawyer
father's dream
architect
Ambedkar

More Telugu News