Shikhar Dhawan: ధోనీని హీరో చేద్దామనుకున్నా.. తొలి మ్యాచ్‌కే నిద్రమాత్ర వేశా: తన ఆత్మకథలో ధావన్ సంచలనాలు

Shikhar Dhawan Recalls First Meeting With MS Dhoni
  • టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆత్మకథ 'ది వన్'
  • తన సంబంధాలు, వివాదాలపై పుస్తకంలో మనసు విప్పిన గబ్బర్
  • అరంగేట్రం మ్యాచ్‌కు ముందు టెన్షన్‌తో నిద్రమాత్రలు వేసుకున్నానని వెల్లడి
  • తొలి వన్డేలోనే డకౌట్.. లోపల మాత్రం కుమిలిపోయానన్న ధావన్
  • ధోనీని చూసి బాలీవుడ్ హీరో అనుకున్నానంటూ ఆసక్తికర ఘటనల ప్రస్తావన
టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన జీవితంలోని ఎన్నో తెలియని కోణాలను, వివాదాలను, వ్యక్తిగత సంబంధాలను తొలిసారిగా ప్రజల ముందుంచాడు. 'ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్' పేరుతో రాసిన తన ఆత్మకథను ఆయన పాఠకుల ముందుకు తెచ్చాడు. మైదానంలో దూకుడుగా కనిపించే 'గబ్బర్' వెనుక ఉన్న సున్నితమైన వ్యక్తిత్వాన్ని, అతను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను ఈ పుస్తకం ఆవిష్కరిస్తోంది.

"క్రికెట్ నాకు ఒక లక్ష్యాన్ని ఇచ్చింది. కానీ ఆ ప్రయాణంలో ఎదురైన ఎత్తుపల్లాలు, నిశ్శబ్ద క్షణాలు నన్ను ఈ రోజు నేనున్న మనిషిగా తీర్చిదిద్దాయి. ఈ ప్రయాణాన్ని నా హృదయం నుంచి పచ్చిగా, నిజాయితీగా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా పంచుకుంటున్నాను" అని ధావన్ తన పుస్తకం గురించి తెలిపారు. ఈ పుస్తకాన్ని హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురించింది. "ధావన్ తన జీవితం, క్రికెట్, సంబంధాలు, ఎదుర్కొన్న ప్రతి సవాలు గురించి మనసు విప్పి మాట్లాడారు" అని ప్రచురణకర్త సచిన్ శర్మ పేర్కొన్నారు.

అరంగేట్రం మ్యాచ్ టెన్షన్.. నిద్రమాత్రలు
2010లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైనప్పుడు తన చిరకాల కల నెరవేరిందని ధావన్ గుర్తుచేసుకున్నాడు. అప్పటి తన అనుభవాలను పంచుకుంటూ, "జట్టులోకి పిలుపు రాగానే భారత డ్రెస్సింగ్ రూమ్‌లో అడుగుపెట్టాను. అక్కడ పొడవాటి జుట్టు, చిరునవ్వుతో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీని చూడగానే, అతడిని ఓ బాలీవుడ్ సినిమాలో హీరోగా పెట్టాలనిపించింది. 'నేను భారత్ తరఫున ఆడాలనుకుంటున్నాను, మిమ్మల్ని బాలీవుడ్ హీరోని చేయాలనుకుంటున్నాను' అని ధోనీతో సరదాగా అన్నాను. దానికి ఆయన గట్టిగా నవ్వేశారు" అని రాశారు.

కొచ్చిలో జరగాల్సిన తొలి వన్డేకు ముందు రాత్రంతా టెన్షన్‌తో నిద్రపట్టలేదని, అయితే ఉదయం లేచేసరికి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి తన ఆశలన్నీ నీరుగారిపోయాయని ధావన్ వాపోయాడు. "ఇక వైజాగ్‌లో రెండో వన్డేకు ముందు మళ్లీ నిద్రలేమి సమస్య ఎదురవకూడదని, ప్రశాంతంగా నిద్రపోవడానికి ఒక నిద్రమాత్ర వేసుకున్నాను. ప్రదర్శన దెబ్బతినకూడదనే అలా చేశాను" అని తన నాటి ఆందోళనను వివరించాడు.

తొలి బంతికే డకౌట్.. నవ్వుతూ పెవిలియన్‌కు
ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్, ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆసీస్ 289 పరుగులు చేయగా, మురళీ విజయ్‌తో కలిసి ధావన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే, క్లింట్ మెక్కే వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. "పెవిలియన్‌కు నడుస్తున్నప్పుడు నా ముఖంపై నవ్వు ఉన్నా, లోపల నన్ను నేను తీవ్రంగా తిట్టుకున్నాను. దేశం కోసం అద్భుతమైన షాట్లు ఆడి, భారీ స్కోరు చేయాలని ఎన్నో ఏళ్లుగా కలలు కన్నాను. కానీ ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా అనిపించింది" అని ధావన్ తన ఆత్మకథలో పేర్కొన్నాడు.

ఈ పుస్తకంలో మీడియా ఒత్తిడి గురించి కూడా ధావన్ ప్రస్తావించాడు. "నేను జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో సోషల్ మీడియా అంతగా లేదు. ఆటగాళ్లపై ఇంత నిఘా ఉండేది కాదు. అప్పట్లో కథనాలు మారడానికి చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఆటగాళ్లను ఒక్క రాత్రిలోనే హీరో నుంచి జీరోను చేసేస్తున్నారు" అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఢిల్లీ క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, ఓపెనర్‌గా మారిన ధావన్.. భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు.
Shikhar Dhawan
Dhawan autobiography
The One Cricket My Life and More
MS Dhoni
India vs Australia
Cricket
Dressing room
Debut match
Sleeplessness
Media pressure

More Telugu News