Kalyan Banerjee: కోల్‌కతా గ్యాంగ్ రేప్.. బాధితురాలినే తప్పుబట్టిన టీఎంసీ ఎంపీ

Kalyan Banerjee Criticized for Victim Blaming in Kolkata Gang Rape
  • స్నేహితులే అత్యాచారం చేస్తే పోలీసులు ఏంచేస్తారన్న ఎంపీ కళ్యాణ్ బెనర్జీ
  • మహిళల స్నేహాలపై కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలు.. వెల్లువెత్తిన విమర్శలు
  • కోల్‌కతా లా కాలేజీ విద్యార్థినిపై క్యాంపస్ లోనే సామూహిక అత్యాచారం
కోల్‌కతాలోని లా కాలేజీ క్యాంపస్ లో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో బాధితురాలినే నిందించేలా ఎంపీ మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు ఎవరితో స్నేహం చేస్తున్నారనే విషయంలో, ముఖ్యంగా చెడు మనస్తత్వం ఉన్న పురుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన చేసిన సూచన వివాదాస్పదమైంది.

విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనపై కల్యాణ్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. "అత్యాచారం చేసింది ఆమె సొంత స్నేహితులే కదా. క్యాంపస్‌లోకి పోలీసులు ప్రవేశించలేరు. అలాంటప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? ఆమె స్నేహితులే. కాపాడాల్సిన స్నేహితులే ఆమెపై అత్యాచారానికి పాల్పడితే, ఇక కాలేజీ యాజమాన్యం గానీ, పోలీసులు గానీ ఏం చేయగలరు?" అని ప్రశ్నించారు. కాలేజీతో, కాలేజీలోని వారితో సంబంధం లేకుంటే పూర్వ విద్యార్థి క్యాంపస్ లోకి ఎలా ప్రవేశిస్తాడని ప్రశ్నించారు.

ఒక ప్రజాప్రతినిధిగా అత్యాచార బాధితురాలికి అండగా నిలవాల్సిన కళ్యాణ్ బెనర్జీ.. బాధితురాలిదే తప్పన్నట్లు మాట్లాడటంపై మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు బాధితురాలిని అవమానించేలా ఉన్నాయని, ఇది బాధ్యతారాహిత్యమని పలువురు విమర్శిస్తున్నారు.
Kalyan Banerjee
Kolkata Gang Rape
TMC MP
Trinamool Congress
Law College Kolkata
Student Rape Case
West Bengal Crime
Kalyan Banerjee Controversy
Political News India

More Telugu News