Ayesha Meera: మరోసారి హైకోర్టులో ఆయేషా మీరా కేసు.. సీబీఐ నివేదిక కోరుతూ అయేషా మీరా తల్లి పిటిషన్

Ayesha Meera Case CBI Report Sought by Mother in High Court
  • అయేషా మీరా తల్లిదండ్రుల పిటిషనపై హైకోర్టులో విచారణ
  • సీబీఐ నివేదిక ఇప్పించాలని కోరిన అయేషా మీరా తల్లిదండ్రులు
  • తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం 
ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నివేదిక కోరుతూ ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు నిన్న విచారణ జరిపింది. పిటిషనర్ల తరపు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ సీబీఐ తుది నివేదికను పొందేందుకు హతురాలి తల్లిదండ్రులు అర్హులన్నారు. నివేదికను అందజేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. సీబీఐ కోర్టులో ఉన్న నివేదికను తీసుకోవచ్చు కదా అని న్యాయస్థానం పేర్కొంది.

ఇప్పటి వరకు 18 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగామని, మళ్లీ నివేదిక కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ఫైలులో చేరకపోవడంతో న్యాయస్థానం విచారణను వచ్చే శుక్రవారం (జులై 4)కి వాయిదా వేసింది. ఆయేషా మీరా రీ పోస్టుమార్టం రిపోర్టులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకురావడంతో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి నిన్న ఉత్తర్వులు ఇచ్చారు.

కాగా, సీబీఐ తుది నివేదికను ఇటీవలే హైకోర్టుకు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషా మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తె హత్య కేసులో సీబీఐ దర్యాప్తు విఫలమైందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి నివేదిక తమకు ఇవ్వలేదని అందుకే అనుమానం కలుగుతోందన్నారు. ఇప్పుడు తమకు న్యాయం జరగాలంటే సీఎం చంద్రబాబు ఈ కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని వారు కోరారు. 
Ayesha Meera
Ayesha Meera case
CBI investigation
Andhra Pradesh High Court
Shamshad Begum
Iqbal Basha
murder investigation
court hearing
justice delayed
Chandrababu Naidu

More Telugu News