Actress Pakeezah: పూట గ‌డ‌వ‌ని దీన స్థితిలో న‌టి పాకీజా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆదుకోవాలని విజ్ఞప్తి

Actress Pakeezah Vasuki seeks help from AP government
  • 'అసెంబ్లీ రౌడీ' ఫేమ్ నటి వాసుగి (పాకీజా) దీనస్థితి
  • పూట గడవక భిక్షాటన చేయాల్సి వస్తోందని ఆవేదన
  • సహాయం కోసం తమిళనాడు నుంచి ఏపీకి రాక
  • పింఛన్ ఇప్పించి తనను బతికించాలని ప్రభుత్వానికి మ‌న‌వి
ఒకప్పుడు తెలుగు తెరపై తనదైన కామెడీతో నవ్వులు పూయించిన నటి వాసుగి.. నేడు కన్నీటి పర్యంతమవుతున్నారు. 'అసెంబ్లీ రౌడీ' చిత్రంలో 'పాకీజా' పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితులు. అలాంటి నటి ఇప్పుడు పూట గడవని దీనస్థితిలో కొన్నిసార్లు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమిళనాడులో ఆదరణ కరువవడంతో ఏపీ ప్రభుత్వం తనను ఆదుకుంటుందన్న ఆశతో ఇక్కడికి వచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

చెన్నై నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన వాసుగిని గుంటూరులో మీడియా ప్రతినిధులు పలకరించారు. ఈ సందర్భంగా ఆమె తన ప్రస్తుత దుర్భర పరిస్థితిని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. "తమిళనాడులో నా పరిస్థితిని వివరిస్తూ వీడియోలు తీసి ఎందరో నటులకు పంపినా ఎవరూ స్పందించలేదు. కానీ తెలుగు సినీ పరిశ్రమలోని చిరంజీవి, నాగబాబు, మోహన్ బాబు కుటుంబాలు నన్ను ఆదుకున్నాయి. ఒకవేళ వారు కూడా ఆదుకోకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని" అని ఆమె తెలిపారు.

రాజకీయాలే జీవితాన్ని మార్చాయా?
వాసుగి స్వస్థలం తమిళనాడులోని కారైకుడి. మోహన్‌బాబు హీరోగా వచ్చిన 'అసెంబ్లీ రౌడీ' చిత్రంలో పాకీజా పాత్ర ఆమెకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'రౌడీగారి పెళ్లాం', 'పెదరాయుడు', 'అన్నమయ్య' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు అప్పటి తమిళనాడు సీఎం జయలలిత పిలుపు మేరకు ఆమె అన్నాడీఎంకే పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి క్రమంగా సినిమాలకు దూరమయ్యారు.

వ్యక్తిగత జీవితంలోనూ విషాదాలు
రాజ్‌కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన జీవితంలో కష్టాలు మొదలయ్యాయని వాసుగి వాపోయారు. అత్తమామల వేధింపులు, భర్త మద్యానికి బానిసై ఆస్తులు కరిగించడం వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. కొంతకాలానికి భర్త ఆత్మహత్య చేసుకోవడంతో అత్తమామలు తనను ఇంటి నుంచి గెంటేశారని ఆమె కన్నీళ్లతో చెప్పారు. ఉన్న కొద్దిపాటి డబ్బును క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి చికిత్స కోసం ఖర్చుచేశానని వివరించారు. తన రాజకీయ గురువైన జయలలిత మరణం తర్వాత తనను పట్టించుకునేవారే కరువయ్యారని ఆవేదన వ్య‌క్తం చేశారు.

ఏపీ ప్రభుత్వంపైనే ఆశలు
"తెలుగువారే నాకు అన్నం పెట్టారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే నన్ను ఆదుకోవాలి. సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి నా గోడు వెల్లడించుకోవాలని ఉంది. నాకు ఒక పింఛన్ సౌకర్యం కల్పిస్తే బతికినంత కాలం వారి పేరు చెప్పుకుని జీవిస్తాను. అవసరమైతే వారి కోసం ఊరూరా తిరిగి ప్రచారం కూడా చేస్తాను" అని వాసుగి విజ్ఞప్తి చేశారు.
Actress Pakeezah
Vasugi
Actress Vasugi
Assembly Rowdy
Telugu actress
Pawan Kalyan
Chiranjeevi
Chandrababu Naidu
Telugu cinema
Poverty

More Telugu News