West Indies Cricketer: వెస్టిండీస్ క్రికెట్‌లో ప్రకంపనలు.. స్టార్ ప్లేయర్‌పై 11 మంది మహిళల లైంగిక ఆరోపణలు!

West Indies Cricketer Faces Sexual Assault Allegations from 11 Women
  • వెస్టిండీస్ జాతీయ జట్టు క్రికెటర్‌పై తీవ్ర లైంగిక ఆరోపణలు
  • టీనేజర్‌ సహా 11 మంది మహిళల నుంచి అత్యాచారం, వేధింపుల ఫిర్యాదులు
  • కేసును తొక్కేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని బాధితుల ఆవేదన
  • ఆధారాలుగా వాయిస్ నోట్స్, స్క్రీన్‌షాట్లు బయటపెట్టిన మహిళలు
  • డబ్బుతో విషయం సెటిల్ చేసేందుకు క్రికెటర్ ప్రయత్నించాడని బాధిత కుటుంబం వెల్లడి
  • ఈ వ్యవహారంపై తమకు సమాచారం లేదన్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు
వెస్టిండీస్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం చోటుచేసుకుంది. ప్రస్తుతం జాతీయ జట్టులో కొనసాగుతున్న ఒక స్టార్ క్రికెటర్ తీవ్రమైన లైంగిక ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్నాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం నిందితుడైన క్రికెటర్ 11 మంది మహిళలపై అత్యాచారం, లైంగిక దాడి, వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

బాధితుల్లో ఒకరైన 18 ఏళ్ల యువతిపై 2023 మార్చి 3న న్యూ ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఒక ఇంట్లో ఈ దారుణం జరిగినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘సోషలైజింగ్’ పేరుతో ఆమెను నమ్మించి తీసుకెళ్లిన ఆ క్రికెటర్, ఇంట్లోని పైగదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ కేసును బయటకు రాకుండా చేసేందుకు క్రికెటర్ అనుచరులతో పాటు గయానా పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత, మరికొందరు మహిళలు ముందుకు వచ్చి, తమ వద్ద ఉన్న స్క్రీన్‌షాట్లు, వాయిస్ నోట్స్, మెడికల్ రిపోర్టులు వంటి ఆధారాలను బయటపెట్టారు.

డబ్బు తీసుకుని విషయాన్ని పరిష్కరించుకోవాలని క్రికెటర్ తమను కోరాడని, కానీ తాము అందుకు నిరాకరించామని ఒక బాధితురాలి కుటుంబం తెలిపింది. ‘మాకు డబ్బు వద్దు, నా కుమార్తెకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలి’ అని వారు స్పష్టం చేశారు. బాధితుల్లో ఒకరి తరఫున వాదిస్తున్న న్యాయవాది నైజెల్ హ్యూస్ మాట్లాడుతూ ఈ ఆరోపణలపై రెండేళ్ల క్రితమే, అంటే 2023 ప్రారంభంలోనే ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. అప్పట్లో విచారణ జరిపి, అభియోగాలు నమోదు చేయాలని ప్రాసిక్యూటర్లు సిఫారసు చేసినా, ఆ తర్వాత కేసు ముందుకు కదల్లేదని ఆయన వివరించారు. ఈ నెల 25, 26 తేదీల్లో మళ్లీ ఆరా తీసినా అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదని, పదేపదే విచారణలు, జాప్యంతో బాధితులు విసిగిపోయారని ఆయన పేర్కొన్నారు.

గతంలోనూ ఇదే క్రికెటర్‌ మైనర్ అయిన బంధువుపై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయినట్టు సమాచారం. అయితే, ఆ తర్వాత బాధితురాలు తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడంతో కేసును మూసివేశారు. కాగా, 2024 జనవరిలో ఆస్ట్రేలియాపై గబ్బాలో చారిత్రక విజయం సాధించిన విండీస్ జట్టులో ఈ క్రికెటర్ సభ్యుడు. అప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ అతనికి ఘన స్వాగతం లభించడం గమనార్హం.

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ సమయంలో ఈ ఆరోపణలు వెలుగులోకి రావడం క్రీడా వర్గాల్లో సంచలనమైంది. ఈ విషయంపై వెస్టిండీస్ క్రికెట్ (సీడబ్ల్యూఐ) అధ్యక్షుడు కిషోర్ షాలో మాట్లాడడుత.. ‘ఈ ఆరోపణలకు సంబంధించిన పరిస్థితులపై మాకు ఎలాంటి అవగాహన లేదు. కాబట్టి, ఈ సమయంలో మేం వ్యాఖ్యానించే స్థితిలో లేం’ అని ఆయన తెలిపారు. మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నప్పటికీ, గయానా అధికారుల నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని సీడబ్ల్యూఐ చెబుతోంది. 
West Indies Cricketer
West Indies cricket
sexual assault allegations
cricket scandal
Gabbah Test
Guyana police
Kishore Shallow
CWI
sexual harassment

More Telugu News