Takahiro Shiraishi: వాళ్లు చనిపోవాలనుకున్నారు, నేను సాయం చేశా అంతే.. జపాన్ ట్విట్టర్ కిల్లర్

Japan Executes Takahiro Shiraishi in Twitter Killer Case
  • టోక్యోలో 9 మందిని చంపిన సైకో కిల్లర్‌కు మరణశిక్ష అమలు
  • బాధితుల్లో 8 మంది మహిళలు, ఒక పురుషుడు
  • మహిళలపై అత్యాచారం చేసి చంపినట్లు విచారణలో వెల్లడి
  • 2020లోనే మరణశిక్ష ఖరారు, తాజాగా అమలు చేసిన ప్రభుత్వం
జపాన్‌ను తీవ్రంగా భయపెట్టిన 'ట్విట్టర్ కిల్లర్' కేసులో నిందితుడికి మరణశిక్ష అమలు చేశారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని 9 మందిని దారుణంగా హత్య చేసిన తకహిరో షిరైషిని టోక్యో డిటెన్షన్ హౌస్‌లో ఉరితీసినట్లు జపాన్ అధికారులు ప్రకటించారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ భయానక అధ్యాయానికి ముగింపు పలికినట్లయింది.

2017లో టోక్యోలోని షిరైషి అపార్ట్‌మెంట్‌లో ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడి మృతదేహాలను పోలీసులు కనుగొనడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని షిరైషి లక్ష్యంగా చేసుకున్నాడు. ట్విట్టర్ ద్వారా వారిని సంప్రదించి, చనిపోవడానికి తాను సహాయం చేస్తానని నమ్మించి తన ఫ్లాట్‌కు రప్పించి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. బాధితులైన ఎనిమిది మంది మహిళలపై షిరైషి లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత వారిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మృతుల్లో టీనేజర్లు కూడా ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యల పరంపరతో అతనికి 'ట్విట్టర్ కిల్లర్' అనే పేరు స్థిరపడింది.

ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం షిరైషిని దోషిగా తేల్చి 2020లోనే మరణశిక్ష విధించింది. అయితే, దేశంలో మరణశిక్షలను రద్దు చేయాలంటూ నిరసనలు జరగడంతో మూడేళ్లుగా జపాన్‌లో ఉరిశిక్షల అమలు నిలిచిపోయింది. తాజాగా ప్రభుత్వం ఈ శిక్షను అమలు చేయడంతో 'ట్విట్టర్ కిల్లర్' కథ ముగిసింది.
Takahiro Shiraishi
Japan Twitter killer
Twitter killer
serial killer
Tokyo
murder case
social media
crime news
Japan crime
Shiraishi apartment

More Telugu News