Roston Chase: ఆటగాళ్లు తప్పు చేస్తే శిక్ష.. అంపైర్లకు మాత్రం ఏమీ ఉండదా?: విండీస్ కెప్టెన్

West Indies Captain Roston Chase Demands Harsh Punishment to Umpires
  • ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో వెస్టిండీస్ 159 పరుగుల భారీ ఓటమి
  • మ్యాచ్ ఓటమి తర్వాత అంపైర్లపై కెప్టెన్ రోస్టన్ చేజ్ తీవ్ర విమర్శలు
  • వివాదాస్పద నిర్ణయాలతో తమను దెబ్బతీశారని ఆరోపణ
  • ఆటగాళ్లను శిక్షించినట్లు అంపైర్లను కూడా శిక్షించాలని డిమాండ్
  • ఒక తప్పుడు నిర్ణయం ఆటగాడి కెరీర్‌నే నాశనం చేస్తుందని ఆవేదన
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఘోర పరాజయం పాలైంది. అయితే, ఈ ఓటమి కంటే ఎక్కువగా మ్యాచ్‌లో చోటుచేసుకున్న వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలపైనే ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ అంపైర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొన్ని సందేహాస్పద నిర్ణయాలు తమ ఓటమికి కారణమయ్యాయని అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఆటగాళ్లు తప్పు చేస్తే కఠినంగా శిక్షిస్తున్నప్పుడు, అంపైర్లకు ఎందుకు జవాబుదారీతనం ఉండదని ఆయన సూటిగా ప్రశ్నించాడు.

బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ఈ టెస్టు మ్యాచ్ మూడో రోజే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించిన వెస్టిండీస్‌కు ఆస్ట్రేలియా గట్టి షాక్ ఇచ్చింది. ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ అర్ధశతకాలతో రాణించడంతో ఆసీస్ జట్టు విండీస్‌ ముందు 301 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 141 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 159 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది.

అయితే, మ్యాచ్ రెండో రోజు జరిగిన కొన్ని సంఘటనలు వివాదానికి దారితీశాయి. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోస్టన్ చేజ్, వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్ మంచి ఫామ్‌లో ఉండగా థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ వివాదాస్పద రీతిలో ఔట్ ఇచ్చారు. బంతి బ్యాట్‌కు తగిలిన తర్వాత ప్యాడ్లకు తాకినట్లు స్పష్టంగా కనిపించినా చేజ్‌ను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించారు.

మరోవైపు షాయ్ హోప్ విషయంలో ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ అందుకున్న క్యాచ్‌లో బంతి నేలను తాకినట్లు రీప్లేలలో కనిపించినా అంపైర్ ఔట్ ఇచ్చారు. ఈ ఇద్దరూ నలభైలలో పరుగులతో క్రీజులో నిలదొక్కుకున్న సమయంలో ఈ నిర్ణయాలు రావడం జట్టు భారీ ఆధిక్యం సాధించే అవకాశాలను దెబ్బతీసింది.

ఈ పరిణామాలపై మ్యాచ్ అనంతరం రోస్టన్ చేజ్ తీవ్రంగా స్పందించాడు. "ఈ మ్యాచ్ నాకు, జట్టుకు తీవ్ర నిరాశ కలిగించింది. ఎన్నో సందేహాస్పద నిర్ణయాలు వెలువడ్డాయి. వాటిలో ఒక్కటి కూడా మాకు అనుకూలంగా రాలేదు. మేం గెలవడం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంటే, అంతా మాకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అనిపించింది" అని అన్నాడు.

"నేను, షాయ్ హోప్ బాగా ఆడుతున్న సమయంలో వచ్చిన ఆ వివాదాస్పద నిర్ణయాలు మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీశాయి. క్రీజులో ఉన్న ఆటగాడికి ఇలాంటివి ఎంతో బాధ కలిగిస్తాయి. ఆటగాళ్లుగా మేం తప్పు చేస్తే, నిబంధనలు అతిక్రమిస్తే మాపై కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ అంపైర్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చినా వారికి ఏమీ జరగదు. వాళ్లు మామూలుగానే తర్వాతి మ్యాచ్‌కు వెళ్లిపోతారు" అని చేజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, "ఇక్కడ ఆటగాళ్ల కెరీర్‌లు పణంగా ఉన్నాయి. ఒక్క తప్పుడు నిర్ణయం ఒక ఆటగాడి కెరీర్‌ను నిలబెట్టొచ్చు లేదా నాశనం చేయొచ్చు. ఆటగాళ్లను శిక్షించినట్లే, ఇలా కళ్లముందే తప్పుడు నిర్ణయాలు ఇచ్చినప్పుడు అంపైర్లకు కూడా ఏదైనా శిక్ష విధించే విధానం ఉండాలని నేను భావిస్తున్నాను" అని రోస్టన్ చేజ్ పేర్కొన్నాడు.
Roston Chase
West Indies vs Australia
West Indies Cricket
Cricket Umpiring
Controversial Decisions
Shai Hope
Alex Carey Catch
Travis Head
Cricket Test Match
Umpire Accountability

More Telugu News