Shadab: ఐఫోన్ తో రీల్స్ చేస్తే ఎక్కువ లైక్ లు వస్తాయని... హత్య చేశారు!

Shadab Murdered for iPhone Reels in Uttar Pradesh
  • ఐఫోన్ కోసం 19 ఏళ్ల యువకుడి దారుణ హత్య
  • నిందితులు 14, 16 ఏళ్ల మైనర్ బాలురు
  • ఐఫోన్‌లో రీల్స్ చేస్తే ఎక్కువ లైక్స్ వస్తాయని ఘాతుకం
  • యూపీలో ఘటన.. బాధితుడు బెంగళూరు వాసి
  • ఫోన్ లొకేషన్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు
  • ముగ్గురు మైనర్లను జువైనల్ హోంకు తరలింపు
సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం యువత ఎంతకైనా తెగిస్తోంది. ఈ వ్యామోహం చివరకు ప్రాణాలు తీసే స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ దారుణ ఘటనే ఇందుకు నిదర్శనం. కేవలం ఐఫోన్‌తో రీల్స్ చేయాలన్న పిచ్చితో ఇద్దరు మైనర్లు ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన షాదాబ్ (19) అనే యువకుడు ఉత్తరప్రదేశ్‌లోని నాగౌర్ గ్రామంలో ఉంటున్న తన మేనమామ వివాహ వేడుకకు హాజరయ్యాడు. అయితే, జూన్ 21వ తేదీ నుంచి అతను అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామ శివార్లలోని ఓ పాడుబడిన బావిలో షాదాబ్ మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి మెడపై కత్తి గాయాలు, తలపై బలమైన గాయాలు ఉండటంతో దీనిని హత్యగా నిర్ధారించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు షాదాబ్ ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేశారు. దాని ఆధారంగా అదే గ్రామానికి చెందిన 14, 16 ఏళ్ల ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. ఐఫోన్‌తో రీల్స్ చేస్తే వీడియోలు హై క్వాలిటీతో వస్తాయని, సోషల్ మీడియాలో ఎక్కువ లైకులు సంపాదించవచ్చనే దురాలోచనతోనే షాదాబ్‌ను హత్య చేసినట్లు నిందితులు నేరం అంగీకరించారు.

ఘటన జరిగిన రోజున, రీల్స్ చేద్దామని నమ్మించి షాదాబ్‌ను ఊరి చివర నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు నిందితులు తెలిపారు. అక్కడకు వెళ్లాక మొదట అతని గొంతు కోసి, ఆ తర్వాత బండరాయితో తలపై మోది కిరాతకంగా చంపినట్లు పోలీసులకు వివరించారు. ఈ హత్య తర్వాత ఆయుధాలను దాచిపెట్టడంలో సహకరించిన మరో బాలుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన ముగ్గురు మైనర్లను గోండా ప్రాంతంలోని డివిజనల్ జువైనల్ హోంకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియా మోజు కోసం ఇంతటి దారుణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Shadab
Uttar Pradesh
murder
iPhone reels
social media likes
minor boys arrested
Nagaon village
Gonda
crime news
viral videos

More Telugu News