BJP: తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధం

BJP State President Elections Set for Telugu States
  • బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి దశకు
  • రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి కొత్త అధ్యక్షులు
  • తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు రేపు నోటిఫికేషన్
  • ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం
  • జులై 1 నాటికి కొలిక్కి రానున్న అధ్యక్షుల ఎంపిక
  • విజయవాడలో షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల అధికారి
బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నూతన అధ్యక్షులను ఎన్నుకునేందుకు పార్టీ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. రెండు రాష్ట్రాలకు దాదాపు ఒకే సమయంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, జులై 1న నూతన సారథులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాయి.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం (జూన్ 29) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం (జూన్ 30) అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం జులై 1వ తేదీన ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు.

ఏపీలోనూ మొదలైన ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఈ వివరాలను పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ విజయవాడలో మీడియా సమావేశంలో వెల్లడించారు. జూన్ 30న నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, అదే రోజు సాయంత్రంలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. జులై 1వ తేదీ నాటికి పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు.
BJP
BJP State President Elections
Andhra Pradesh BJP
Telangana BJP
AP BJP Election
TS BJP Election

More Telugu News