Vamsi Mahaa News: జర్నలిస్టులను చంపేస్తారా? అవసరమైతే కేటీఆర్ ఇంటికి వెళతా!: 'మహాన్యూస్' వంశీ

Vamsi Comments on Mahaa News Office Attack by BRS
  • నిరసనకు రాళ్లు, రాడ్లు ఎందుకని ప్రశ్నించిన 'మహాన్యూస్' వంశీ
  • మహాన్యూస్ తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని వ్యాఖ్య
  • కానీ దాడుల సంస్కృతి ఏమిటని నిలదీత
  • నరికేస్తాం, చంపేస్తామని బెదిరించడం ఏమిటని ఆగ్రహం
హైదరాబాద్‌‍లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ వర్గీయులు దాడి చేశారంటూ ఛానల్ ఎండీ వంశీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దాడిని  ఖండించారు. నిరసన వ్యక్తం చేయాలనుకుంటే రాళ్లు, రాడ్లు వంటి ఆయుధాలు ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా కార్యాలయం ఎదుట నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ ఇలాంటి దాడులకు పాల్పడటం దుర్మార్గమని అన్నారు. ఒకవేళ మహాన్యూస్ ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇలాంటి దాడులను ప్రజలు హర్షిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఇరవై మందికి పైగా కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే తమ సిబ్బంది ప్రాణాలకు తెగించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు.

జర్నలిస్టులపై దాడులు చేస్తే వారి ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను చంపేస్తారా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఈ దాడి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆలోచించాలని సూచించారు. కొందరు ఈ దాడికి మద్దతు పలుకుతున్నారని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వారిని ఎవరు కాపాడుతారని ఆయన ప్రశ్నించారు. ఈ దాడిపై మహాన్యూస్ తప్పకుండా పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అనుచరులని అర్థమవుతోందని వంశీ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి, తమ నాయకుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని దాడి చేసిన వారు నినాదాలు చేశారని ఆయన తెలిపారు. నరికేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తామని బెదిరించారని ఆయన వాపోయారు. కేసీఆర్ నాయకత్వంలోని పార్టీలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజాన్ని ఎటువైపు తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు.

మేము ఏదైనా తప్పు చేసి ఉంటే నిలదీయవచ్చని వంశీ అన్నారు. అవసరమైతే తాను కేటీఆర్ ఇంటికి వెళతానని లేదా కేటీఆర్ తన స్టూడియోకు రావొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ దాడి ఘటనలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోందని, పోలీసు విచారణపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ మాట్లాడితే బాగుంటుందని ఓ జర్నలిస్టుగా తాను కోరుకోవడంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. మీడియాపై దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Vamsi Mahaa News
Mahaa News attack
KTR
BRS
Telangana politics
Journalist attack

More Telugu News