Klara: ఇంగ్లీష్‌లో పక్కా ఇండియన్ యాస.. జర్మన్ యువతి వీడియోకు నెటిజన్లు ఫిదా!

German Woman Klara Explains Her Perfect Indian English Accent
  • ఈ జర్మన్ అమ్మాయికి ఇండియన్ యాస ఎలా వచ్చింది? వైరల్ అవుతున్న వీడియో!
  • తాను మలయాళం కూడా మాట్లాడతానన్న జర్మన్ యువతి 
  • ఎక్కువగా భారతీయులతోనే ఇంగ్లీషులో సంభాషిస్తానని 
  • అందుకే తన యాస మారిందంటూ వివరణ
  • జర్మన్ యువతి సమాధానానికి నెటిజన్ల ప్రశంసలు
సాధారణంగా విదేశీయులు భారతీయ భాషలు నేర్చుకోవడం, మన సంస్కృతికి ఆకర్షితులు కావడం చూస్తుంటాం. కానీ, ఓ జర్మన్ యువతి ఏకంగా ఇంగ్లీష్‌ను భారతీయ యాసలో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్న క్లారా అనే జర్మన్ టీచర్, తాను ఎందుకు ఇండియన్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడతానో వివరిస్తూ చేసిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది.

సోషల్ మీడియాలో తరచూ తనకు ఎదురయ్యే ఓ ప్రశ్నకు క్లారా ఈ వీడియో ద్వారా సమాధానం ఇచ్చారు. "ఈమె భారతీయురాలు కాదు కదా, మరి ఇంగ్లీష్‌లో ఇండియన్ యాస ఎలా మాట్లాడుతోంది?" అని చాలామంది అడుగుతుంటారని ఆమె పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ, "నిజమే, నేను భారతీయురాలిని కాదు, జర్మనీకి చెందినదాన్ని. వాస్తవానికి నేను జర్మన్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడాలి. కానీ నా యాస భారతీయంగా ఉండటానికి కొన్ని కారణాలున్నాయి" అని ఆమె వివరించారు.

దానికి గల కారణాలను వివరిస్తూ, "మొదటి కారణం, నేను ఇంగ్లీష్‌లో కేవలం భారతీయులతోనే మాట్లాడతాను. మనం ఎవరితో ఎక్కువగా మాట్లాడితే, వాళ్ళ యాసనే అనుకరిస్తాం. అందుకే నాకు ఇండియన్ యాస అలవడింది" అని తెలిపారు. "రెండో ముఖ్యమైన కారణం, నేను మలయాళం మాట్లాడతాను. మలయాళంలో మాట్లాడేటప్పుడు మధ్యమధ్యలో ఎన్నో ఇంగ్లీష్ పదాలు వాడతాం. ఆ పదాలను భారతీయ యాసలోనే పలుకుతాం. ఉదాహరణకు, మలయాళంలో 'ఫ్రిడ్జ్' కావాలని చెప్పాలంటే, ఆ పదాన్ని ఇండియన్ ఇంగ్లీష్ యాసలోనే అంటాను. ఒకవేళ నేను బ్రిటిష్ యాసలో ఆ పదాన్ని పలికితే వింతగా ఉంటుంది. బహుశా ఇదే నా యాస మారడానికి ప్రధాన కారణం అనుకుంటున్నాను" అని క్లారా స్పష్టం చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో కొద్ది కాలంలోనే వైరల్ అయింది. ఇప్పటివరకు దీనికి 6 లక్షల 38 వేలకు పైగా వ్యూస్, 24 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. క్లారా ఇచ్చిన వివరణకు నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ, "మనం ఎవరితో మాట్లాడితే వారికే అర్థమయ్యేలా మన యాస మారుతుంది. ఇది చాలా సహజం" అని కామెంట్ చేశారు. మరో యూజర్, "మీ ఇంగ్లీష్‌లో దక్షిణాది, ముఖ్యంగా కేరళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది" అని పేర్కొన్నారు. "మీకు జర్మన్, మలయాళం, ఇంగ్లీష్‌లో ఇండియన్ యాస తెలుసు. ఇది అద్భుతం" అంటూ ఇంకొకరు ప్రశంసించారు.

Klara
German woman
Indian accent
English speaking
Malayalam
Kerala
Social media
Viral video
German teacher
Indian English

More Telugu News