Chimelong Spaceship: ఇంతకంటే పెద్ద ఆక్వేరియం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు!

Chimelong Spaceship Worlds Largest Aquarium Opens in China
  • చైనాలో ‘చిమెలాంగ్ స్పేస్‌షిప్’ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ థీమ్ పార్క్
  • ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియంగా గిన్నిస్ రికార్డుల గుర్తింపు
  • స్పేస్‌షిప్ ఆకారంలో ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో అద్భుత నిర్మాణం
  • ఒకే ట్యాంక్‌లో 5.6 కోట్ల లీటర్ల నీటితో ప్రపంచ రికార్డు
  • 300కు పైగా జాతుల సముద్ర జీవులు, సబ్‌మెరైన్ రైడ్ ప్రత్యేక ఆకర్షణ
  • యానిమల్ షోలు, రైడ్‌లు, 5డి సినిమాతో పూర్తిస్థాయి వినోద కేంద్రం
చైనాలో ఓ కొత్త అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ థీమ్ పార్క్ మరియు అక్వేరియంగా 'చిమెలాంగ్ స్పేస్‌షిప్' సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జుహై నగరంలో ఉన్న ఈ భారీ నిర్మాణం, అచ్చం అంతరిక్ష నౌక (స్పేస్‌షిప్) ఆకారంలో ఉండి సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. 2023లో ప్రారంభమైన ఈ పార్క్, తన అద్భుతమైన డిజైన్, వినోదం, సముద్ర జీవుల ప్రదర్శనతో ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

గిన్నిస్ రికార్డులు బద్దలు కొట్టిన అక్వేరియం

ఈ థీమ్ పార్క్ ప్రధాన ఆకర్షణ ఇక్కడి అక్వేరియం. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ఈ అక్వేరియంలో ఏకంగా 7.5 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. మొత్తం 38 వేర్వేరు ట్యాంకులలో భారీ సొరచేపలు (వేల్ షార్క్స్), టైగర్ షార్క్స్, ఆర్కాస్ వంటి 300కు పైగా జాతులకు చెందిన సముద్ర జీవులను ఇక్కడ చూడవచ్చు.

ఈ అక్వేరియం పలు ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియం ట్యాంక్ (5.64 కోట్ల లీటర్లు), అతిపెద్ద జీవ పగడపు దిబ్బల ప్రదర్శన (లివింగ్ కోరల్ రీఫ్), మరియు అతిపెద్ద అక్వేరియం విండో (39.6 మీటర్ల పొడవు, 8.3 మీటర్ల వెడల్పు) వంటి రికార్డులు దీని సొంతం. కాలిఫోర్నియాకు చెందిన లెగసీ ఎంటర్‌టైన్‌మెంట్ దీనిని డిజైన్ చేసింది.

వినోదం, విజ్ఞానం... అన్నీ ఒకేచోట

కేవలం పరిమాణంలోనే కాదు, సందర్శకులకు అందించే అనుభవంలోనూ ఈ స్పేస్‌షిప్ ప్రత్యేకమైనది. లోపలికి అడుగుపెట్టగానే కాస్మిక్ వరల్డ్, ఏషియా ప్లానెట్, రెయిన్‌ఫారెస్ట్ ప్లానెట్ వంటి విభిన్న థీమ్ జోన్‌లు స్వాగతం పలుకుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ ట్యాంక్ అయిన 'వేల్ షార్క్ ఎగ్జిబిషన్' ఇక్కడి ప్రధాన ఆకర్షణ. దీనితో పాటు, అక్వేరియం లోపలికి సబ్‌మెరైన్‌లో ప్రయాణించే 'డీప్ సీ ఒడిస్సీ రైడ్, అమెజాన్ నది జీవవైవిధ్యాన్ని తెలిపే 'జర్నీ టు ది అమెజాన్' ఎగ్జిబిషన్ వంటివి సరికొత్త అనుభూతిని అందిస్తాయి.

చిమెలాంగ్ ఇంటర్నేషనల్ ఓషన్ టూరిస్ట్ రిసార్ట్‌లో భాగంగా ఉన్న ఈ పార్క్‌లో ఆర్కాస్, సీ లయన్లతో నిర్వహించే యానిమల్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. థ్రిల్ కోరుకునే వారి కోసం 'ప్యారెట్ కోస్టర్' వంటి రైడ్‌లు, 5డి సినిమా, ఇంటర్‌స్టెల్లార్ థియేటర్ కూడా అందుబాటులో ఉన్నాయి. సందర్శకుల సౌకర్యార్థం పార్కుకు సమీపంలోనే 'చిమెలాంగ్ స్పేస్‌షిప్ హోటల్' కూడా ఉంది. జుహై నగరానికి బస్సు, ట్యాక్సీల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. సమీపంలోనే రైల్వే స్టేషన్, విమానాశ్రయం కూడా ఉండటంతో సందర్శకులకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. మొత్తంగా ఈ పార్క్ వినోదం, విజ్ఞానం, అద్భుతమైన డిజైన్ల సమాహారంగా నిలుస్తోంది.
Chimelong Spaceship
China
Aquarium
Zhuhai
Guangdong
Theme Park
Ocean Tourist Resort
Whale Sharks
Guinness World Record
Marine Life

More Telugu News