Shubhanshu Shukla: అంతరిక్షంలో 'భారత్ మాతా కీ జై'.. శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ!

Shubhanshu Shukla Says Bharat Mata Ki Jai in Space Talks with PM Modi
  • అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా
  • శుక్లాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ
  • భారత మానవసహిత యాత్ర గగన్‌యాన్‌కు ఇది తొలి అడుగు అని పేర్కొన్న ప్రధాని
  • అంతరిక్షం నుంచి చూస్తే భూమిపై సరిహద్దులే కనిపించవన్న శుక్లా
భారత అంతరిక్ష రంగంలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైంది. భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు శుక్లాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో భాగంగా శుక్లా ‘భారత్ మాతా కీ జై’ అని నినదించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శుభాంశు శుక్లా ప్రయాణం దేశ ప్రతిష్ఠను మరింత పెంచిందని కొనియాడారు. "మీరు మిషన్ కోసం భౌతికంగా దేశానికి దూరంగా ఉన్నప్పటికీ, 140 కోట్ల మంది భారతీయుల హృదయాలకు చాలా దగ్గరగా ఉన్నారు. మీ ఈ చారిత్రక యాత్ర ఒక నూతన శకానికి నాంది పలుకుతుంది. ఇది మన దేశ మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్‌'కు మొదటి అడుగు వంటిది. అంతరిక్షాన్ని అన్వేషించాలనే భారత విద్యార్థుల ఆకాంక్షలకు మీ విజయం మరింత బలాన్నిస్తుంది" అని శుక్లాను ఉద్దేశించి ప్రధాని అన్నారు. ఈ ప్రయాణం వికసిత భారత్ లక్ష్యానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని ప్రశంసలకు శుభాంశు శుక్లా వినమ్రంగా స్పందించారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, యావత్ భారతదేశం సాధించిన సమష్టి విజయమని అన్నారు. "భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వకారణంగా ఉంది. ఇక్కడి నుంచి మన దేశాన్ని మొదటిసారి చూసినప్పుడు, మ్యాప్‌లో చూసిన దానికంటే ఎంతో పెద్దదిగా, మహోన్నతంగా కనిపించింది. ఈ భూమి అంతా ఒకే ఇల్లు, మనమంతా ఒకే కుటుంబం అనే భావన కలుగుతోంది. ఇక్కడి నుంచి చూస్తే దేశాల మధ్య సరిహద్దులు, విభజన రేఖలు కనిపించవు, అంతా ఏకత్వమే కనిపిస్తుంది" అని తన అనుభూతిని పంచుకున్నారు.

అమెరికాకు చెందిన యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వాయుసేనకు చెందిన శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లారు. ఆయనతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలండ్‌కు చెందిన స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ-విస్నీవ్‌స్కీ, హంగేరీకి చెందిన టిబర్‌ కపు ఈ బృందంలో ఉన్నారు.
Shubhanshu Shukla
Narendra Modi
Indian Air Force
Gaganyaan
International Space Station

More Telugu News