YS Sharmila: నిజాలు బయటపడుతుంటే ట్యాపింగ్ దొంగలకు భయం పట్టుకుంది... మహా న్యూస్ కు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి: షర్మిల

YS Sharmila Condemns Attack on Mahaa News Over Phone Tapping Report
  • మహా న్యూస్ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల
  • ఇది బీఆర్ఎస్ గూండాల పనేనని తీవ్ర ఆరోపణ
  • గతంలో తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని వెల్లడి
  • ట్యాప్ చేసిన ఆడియోను వైవీ సుబ్బారెడ్డి తనకు వినిపించారని వ్యాఖ్య
  • నిజాలు బయటపడుతున్నాయనే భయంతోనే దాడులని విమర్శ
  • బీఆర్ఎస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వార్తలు ప్రసారం చేస్తున్న మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడడాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను వెలికితీస్తున్న మీడియా సంస్థపై భౌతిక దాడులకు దిగడం అప్రజాస్వామికమని ఆమె అన్నారు.

"తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై వాస్తవాలను ప్రసారం చేస్తున్న మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై, బీఆర్ఎస్ గూండాల దాడిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఛానెల్ లో పనిచేసే సిబ్బందిపై, ముఖ్యంగా మహిళా జర్నలిస్టుల మీద దాడి హేయమైన చర్య. ఇలాంటి దాడులు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాయి. నా ఫోన్ ట్యాప్ చేశారు. ట్యాప్ చేసిన ఆడియోనే వైవీ సుబ్బారెడ్డి గారు నాకు వినిపించారు. 

ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అన్నట్లు... ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీ దొంగ చెవులను పసిగడుతుంటే దాడులకు దిగుతారా? వాస్తవాలు చెప్పే వాళ్లను చంపాలని చూస్తారా? అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎవరి ఫోన్లనైనా ట్యాప్ చేయవచ్చా? అడిగినోళ్లకు సైతం ట్యాప్ చేసిన కాల్ రికార్డ్స్ పంపవచ్చా? దొంగతనంగా ఫోన్లు ట్యాప్ చేసి నీచానికి ఒడిగడతారా? తీగ లాగుతుంటే డొంక కదులుతుంది అన్నట్లు సిట్ విచారణలో నిజాలన్నీ బయట పడుతుంటే, ట్యాపింగ్ దొంగలకు భయం పట్టుకుంది. తక్షణమే మహా న్యూస్ యాజమాన్యానికి బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం" అని షర్మిల స్పష్టం చేశారు.
YS Sharmila
Telangana phone tapping
Mahaa News attack
BRS goons
phone tapping case
media freedom
Telangana politics
YV Subba Reddy
SIT investigation
political scandal

More Telugu News