Chandrababu Naidu: మహిళలకు ఉచిత బస్సు... ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే అమలు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Free Bus for Women from August 15 Despite Financial Burden
  • ఎన్నికల వేళ సూపర్ సిక్స్ హామీలు
  • హామీల అమలుకు కసరత్తులు చేస్తున్న కూటమి ప్రభుత్వం
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నేడు అధికారులతో చంద్రబాబు సమీక్ష
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు 'సూపర్ సిక్స్' లో మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు కొత్త బస్సులు కొనడం గానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం గానీ చేయాలని సీఎం సూచించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ విద్యుత్ ఆధారిత ఏసీ బస్సులే ఉండాలని, ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే, ప్రతీ బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. 

ఆర్థిక కష్టాలున్నా హామీలు నిలబెట్టుకోవాలి

రాష్ట్రంలో ఆర్ధికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా... ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని... అదే సమయంలో ప్రజాధనం సద్వినియోగం కావాలని, ప్రతీ రూపాయి విలువైనదేనని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. ఆర్ధిక కష్టాలను అధిగమించాలంటే ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని సూచించారు. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి... ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను ఎలా పొందాలి అనే దానిపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా సమర్ధత పెంచుకోవాలని చెప్పారు. బస్ కాంప్లెక్స్‌లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచడం దగ్గర నుంచి బస్సు ప్రయాణం వరకు ప్రయాణికుల్లో సంతృఫ్తి పెరిగేలా నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.    

వివిధ మోడళ్ల పరిశీలనకు సీఎం ఆదేశం

"బ్యాటరీ స్వాపింగ్ విధానంతో ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయం తగ్గే అంశాన్ని పరిశీలించాలి. డీజిల్, ఈవీ, సీఎన్జీ, బ్యాటరీ స్వైపింగ్... ఇలా ఏ బస్సు కొనుగోలు, నిర్వహణకు ఎంత వ్యయం అవుతుందనే ప్రతిపాదనలు రూపొందించండి. బ్యాటరీ, బ్యాటరీ లేకుండా, సర్వీస్ స్టేషన్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహించడం, బస్సులను ఆపరేట్ చేయడం... ఇలా ఏ విధానంతో వ్యయం తగ్గుతుందనేది పరిశీలించండి. ఆర్టీసీనే పవర్ జనరేట్ చేసి.... ఈవీ బస్సులు వినియోగించగలిగితే ఎంతమేర మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుందనేది అంచనా వేయండి. పూర్తి స్థాయిలో కసరత్తు జరగాలి" అని ముఖ్యమంత్రి అన్నారు.  

అదనంగా 2,536 బస్సులు అవసరం

కొత్త పథకం అమలుకు అదనంగా మరో 2,536 బస్సులు అవసరమని అధికారులు లెక్కలు తేల్చారు. దీనికి రూ.996 కోట్లు వ్యయం కానుందని భావిస్తున్నారు. అలాగే బస్ స్టేషన్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ, బస్సుల సమాచార బోర్డులు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉందని సీఎంకు అధికారులు వివరించారు.

ఏడాదిలో 88.90 కోట్ల సార్లు ప్రయాణిస్తారని అంచనా

రాష్ట్రంలో మొత్తం జనాభా 5.25 కోట్లు ఉంటే అందులో మహిళలు 2.62 కోట్లు ఉన్నారు. వీరిలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో మహిళల ప్రయాణాల సంఖ్య ప్రస్తుతం ఏడాదికి 43.06 కోట్లుగా ఉంది. అయితే ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత ఇది 75.51 కోట్లకు పెరగొచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి మహిళ సగటున వారానికి ఒకసారి అయినా ప్రయాణిస్తుంటారని తెలిపారు. అలాగే ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహిళల ప్రయాణాల సంఖ్య 6.85 కోట్లుగా ఉంది. పథకం అమలు తర్వాత ఈ సంఖ్య 13.39 కోట్లకు పెరగొచ్చు. మొత్తమ్మీద ఉచిత బస్సు పథకంతో మహిళలు ఏడాదిలో 88.90 కోట్ల సార్లు ప్రయాణించే వీలుంది.  

అన్ని రాష్ట్రాలకన్నా ఉత్తమంగా రాష్ట్రంలో అమలు 

ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రవేశ పెట్టే విధానం అత్యుత్తమంగా, సంతృప్తి కలిగేలా... ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

57 శాతం పల్లె వెలుగు, సిటీ బస్సు సర్వీసులే 

మొత్తం బస్సుల్లో 57 శాతం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు ఉన్నాయి. గత ఏడాదిలో ఇవి 67.76 కోట్ల కిలో మీటర్ల దూరం ప్రయాణించాయి. అలాగే ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు మరో 17 శాతం ఉన్నాయి. రాష్ట్రంలో పెద్ద నగరాలు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడంతో కేంద్రం రాష్ట్రానికి బస్సులు కేటాయించింది. రాష్ట్రంలో 11 మున్సిపల్ కార్పొరేషన్లకు 750 ఈవీ బస్సులను కేంద్ర ప్రభుత్వం అర్బన్ ట్రాన్స్‌పోర్టు కింద అందిస్తోంది.

Chandrababu Naidu
APSRTC
Free Bus Travel
Andhra Pradesh
Women Free Bus
Super Six Scheme
AP Government
Electric Buses
August 15
Bus Services

More Telugu News