BRS Party: 'మహా టీవీ' వివాదం... లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ పార్టీ

BRS Party Issues Legal Notice to Mahaa TV Over Defamatory Content
  • మహా టీవీ యాజమాన్యానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌పై అసత్య ప్రచారమని ఆరోపణ
  • విధానం మార్చుకోకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ మహా టీవీ యాజమాన్యానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఛానల్ కార్యాలయంపై దాడి జరిగిన రెండు గంటల వ్యవధిలోనే ఈ నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. తమ నాయకులపై జర్నలిజం ముసుగులో వ్యక్తిగతంగా విషం చిమ్ముతుండటంతో నోటీసులు ఇచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది.

గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మహా టీవీ తమ యూట్యూబ్ ఛానల్‌లో తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తా కథనాలను ప్రసారం చేస్తోందని బీఆర్ఎస్ తన నోటీసులో ఆరోపించింది. పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఛానల్ తన వైఖరి మార్చుకోలేదని, జర్నలిజం ముసుగులో తమ పార్టీ నాయకత్వంపై వ్యక్తిగత దూషణలకు దిగుతోందని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.

ముఖ్యంగా 'తమ్మినేని తమ్ముడు' వంటి పాత్రలతో కించపరిచేలా కథనాలు రూపొందించి, తమ నేతల ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంలోని కొందరు నేతలతో కుమ్మక్కై మహా టీవీ యాజమాన్యం ఈ దుష్ప్రచారానికి పాల్పడుతోందని పార్టీ ఆరోపించింది.

ఇప్పటికైనా మహా టీవీ వైఖరి మార్చుకోకపోతే, చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని బీఆర్ఎస్ హెచ్చరించింది. గతంలో మంత్రి కొండా సురేఖపై తమ పార్టీ వేసిన రూ.100 కోట్ల పరువు నష్టం దావా, క్రిమినల్ డెఫమేషన్ కేసును ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఆ కేసులో న్యాయస్థానం, ఎన్నికల సంఘం ఆమెను హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించింది.

మహా టీవీ కూడా తమ విధానాలు మార్చుకోని పక్షంలో అదే తరహాలో పరువు నష్టం దావా, క్రిమినల్ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. వార్తా సంస్థగా మహా టీవీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, జర్నలిజాన్ని వ్యక్తిగత ఎజెండాలకు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది.
BRS Party
KCR
KTR
Mahaa TV
Telangana Politics
Phone Tapping Case
Defamation
Legal Notice

More Telugu News