Himachal Pradesh: హిమాచల్‌లో 'పుష్ప' సీన్.. నదిలో తేలియాడుతున్న కలప.. పుష్పరాజ్ ఎక్కడంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

Himachal Pradesh Floods Expose Illegal Logging Pushpa Movie Reference
  • హిమాచల్‌లో భారీ వర్షాలకు పండోహ్ డ్యామ్‌లోకి కొట్టుకొచ్చిన టన్నుల కొద్దీ కలప
  • డ్యామ్ గేట్లు తెరవడంతో నదిపై తేలియాడుతున్న కలప దుంగల ఫొటోలు వైరల్
  • 'హిమాచల్ పుష్పరాజ్' ఎక్కడంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు, సెటైర్లు
  • రాష్ట్రంలో అక్రమ కలప నరికివేత జరుగుతోందని అంగీకరించిన అధికార కాంగ్రెస్
  • అటవీశాఖపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు అక్రమ కలప దందాను బట్టబయలు చేశాయి. ప్రకృతి ప్రకోపానికి టన్నుల కొద్దీ కలప దుంగలు నదిలో తేలియాడుతుండగా, వాటి తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు "హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడా?" అంటూ తెలుగు సినిమా 'పుష్ప'ను గుర్తుచేస్తూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..!
గత కొద్ది రోజులుగా హిమాచల్‌లోని కుల్లూ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా బీబీఎంబీ (భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్) ఆధీనంలోని పండోహ్ డ్యామ్‌లోకి భారీగా వరద నీటితో పాటు టన్నుల కొద్దీ కలప దుంగలు కొట్టుకువచ్చాయి. డ్యామ్‌కు ప్రమాదం వాటిల్లకుండా అధికారులు ఐదు గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఆ కలప దుంగలన్నీ నదిపై తేలుతూ కిలోమీటర్ల మేర కనిపించాయి. ఈ దృశ్యాలు చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.

హిమాచల్‌లో రాజకీయ దుమారం
ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. రాష్ట్రంలో అక్రమంగా చెట్ల నరికివేత ఏ స్థాయిలో జరుగుతోందో ఈ దృశ్యాలే నిదర్శనమని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించాయి. అయితే, అనూహ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఈ వాదనతో ఏకీభవించింది. రాష్ట్రంలో అక్రమ కలప నరికివేత జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించింది.

సొంత పార్టీ ప్రభుత్వంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ రాఠౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అటవీ శాఖ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
Himachal Pradesh
Kullu
floods
timber smuggling
illegal logging
Pushpa movie
Himachal floods
Kuldeep Singh Rathore
BBMB
Pandoh Dam

More Telugu News