Yash Dayal: పెళ్లి పేరుతో ఐదేళ్లుగా నరకం చూపించాడు.. ఆర్సీబీ పేసర్ యశ్ దయాళ్‌పై యువతి ఫిర్యాదు

Woman files complaint against cricketer Yash Dayal for exploiting on pretext of marriage
  • యశ్ దయాళ్‌పై ఘజియాబాద్ యువతి తీవ్ర ఆరోపణలు
  • మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వాడుకున్నాడని ఫిర్యాదు
  • యూపీ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు
  • విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులకు సీఎంఓ ఆదేశం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ఉత్తరప్రదేశ్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ పేసర్ యశ్ దయాళ్‌పై ఒక యువతి సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను ఐదేళ్లుగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె యూపీ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది.

ఘజియాబాద్‌కు చెందిన బాధితురాలు తన ఫిర్యాదులో పలు కీలక విషయాలను వెల్లడించింది. యశ్ దయాళ్‌తో గత ఐదేళ్లుగా తాను సంబంధంలో ఉన్నానని, ఈ క్రమంలో పెళ్లి పేరుతో తనను పూర్తిగా వాడుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను కోడలిగా పరిచయం చేస్తూ యశ్ దయాళ్ తన తల్లిదండ్రులకు, బంధువులకు కూడా చూపించాడని, దాంతో అతడిని గుడ్డిగా నమ్మానని తెలిపింది.

నా వ‌ద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి: బాధితురాలు
అతడి మోసాన్ని గ్రహించి నిలదీయగా తనపై శారీరక హింసకు పాల్పడి, మానసిక వేదనకు గురిచేశాడని ఆమె ఆరోపించింది. తన వద్ద యశ్ దయాళ్ మోసానికి సంబంధించి చాట్ రికార్డులు, స్క్రీన్‌షాట్లు, వీడియో కాల్స్, ఫొటోల రూపంలో బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. రిలేష‌న్‌లో ఉన్నప్పుడు తన వద్ద నుంచి యశ్ దయాళ్ డబ్బులు కూడా తీసుకున్నాడని తెలిపింది. గతంలో ఇలాగే ఇతర యువతులను కూడా మోసం చేశాడని తన దృష్టికి వచ్చిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఈ విషయంపై తాను ఈ నెల‌ 14న మహిళా హెల్ప్‌లైన్ 181కు కాల్ చేసినప్పటికీ, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రక్రియ ముందుకు సాగలేదని బాధితురాలు వాపోయింది. దీంతో తీవ్ర మానసిక, సామాజిక ఒత్తిడికి గురైన తాను న్యాయం కోసం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు వివరించింది.

ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సీఎంఓ 
ఈ ఫిర్యాదుపై సీఎంఓ వెంటనే స్పందించింది. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం సర్కిల్ ఆఫీసర్ (సీఓ)ను విచారణకు ఆదేశించింది. ఐజీఆర్ఎస్ ద్వారా అందిన ఈ ఫిర్యాదును జులై 21లోగా పరిష్కరించి, పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ ప్రారంభం కానుంది.
Yash Dayal
RCB
Royal Challengers Bangalore
IPL
Uttar Pradesh cricket
Ghaziabad
cheating case
domestic violence
police investigation
online complaint

More Telugu News