TTD: శ్రీవారి భక్తులకు ఇన్సూరెన్స్.. కీలక ప్రతిపాదనపై టీటీడీ కసరత్తు

TTD Considering Insurance for Tirumala Pilgrims
  • తిరుమల వచ్చే భక్తులందరికీ బీమా కల్పించే యోచనలో టీటీడీ
  • ప్రమాదాలు, జంతువుల దాడుల నేపథ్యంలో భక్తులకు భరోసా ఇచ్చే ఆలోచ‌న‌
  • అలిపిరి నుంచి తిరుమల చేరే వరకు బీమా వర్తింపజేయాలని పరిశీలన
  • భారీ ప్రీమియం, దాతల సహకారం వంటి అంశాలపై అధికారుల అధ్యయనం
  • ప్రస్తుతం ప్రమాద మరణాలకు టీటీడీ రూ.3 లక్షల పరిహారం
తిరుమల శ్రీవారి దర్శనానికి వ‌చ్చే లక్షలాది మంది భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా టీటీడీ ఒక కీలకమైన ప్రతిపాదనను పరిశీలిస్తోంది. భవిష్యత్తులో తిరుమల యాత్రకు వచ్చే ప్రతి భక్తుడికీ బీమా సౌకర్యం కల్పించాలనే ఆలోచనపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలైతే యాత్రికులకు మరింత ధీమా లభించనుంది.

భ‌క్తుల భద్రతకు పెద్దపీట వేయాలనే ఆలోచన
ప్రతిరోజూ సగటున 70 వేల నుంచి లక్ష మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. ఈ ప్రయాణంలో రెండు ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల గుండా ప్రయాణిస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరగడం, క్యూలైన్లలో ఉన్నప్పుడు ఆకస్మిక అనారోగ్యానికి గురికావడం, ముఖ్యంగా నడక మార్గాల్లో వన్యప్రాణుల దాడులు వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో నష్టపోయిన భక్తులకు, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే సదుద్దేశంతో టీటీడీ ఈ బీమా ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు సమాచారం.

విస్తృత పరిధిలో బీమా సౌకర్యం
ప్రస్తుతం తిరుమల పరిధిలో ప్రమాదవశాత్తు ఎవరైనా భక్తులు మరణిస్తే వారికి టీటీడీ తరఫున రూ. 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతోంది. అయితే, తాజా ప్రతిపాదన ప్రకారం ఈ పరిధిని మరింత విస్తరించాలని భావిస్తున్నారు. భక్తులు అలిపిరి వద్ద యాత్ర ప్రారంభించినప్పటి నుంచి తిరుమల చేరుకుని, దర్శనానంతరం తిరిగి కిందకు వచ్చేవరకు ఈ బీమా వర్తించేలా చూడాలని యోచిస్తున్నారు. ప్రమాదాలు, గుండెపోటు వంటి ఆకస్మిక మరణాలు, జంతువుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ బీమా ద్వారా చేయూత అందించడమే ప్రధాన లక్ష్యం.

సాధ్యాసాధ్యాలపై అధ్యయనం
లక్షలాది మంది భక్తులకు ఒకేసారి బీమా కల్పించడం ఒక బృహత్కార్యం. దీని అమలులో ఎదురయ్యే సవాళ్లపై టీటీడీ అధికారులు దృష్టి సారించారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులకు బీమా సదుపాయం కల్పించడానికి ముందుకొచ్చే సంస్థలు ఏవి? వారు వసూలు చేసే ప్రీమియం ఎంత ఉంటుంది? ఈ ఆర్థిక భారాన్ని పూర్తిగా టీటీడీ భరించాలా? లేక దాతల సహకారం తీసుకోవాలా? అనే అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
TTD
Tirumala
Tirupati
TTD Insurance
Pilgrim Insurance
Srivari Darshan
Alipiri
Srivari Mettu
Ghat Roads
Pilgrim Safety

More Telugu News