Pakistan: మాపై నిందలా? పాకిస్థాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్!

Pakistan Blames India For Suicide Car Bomb Attack Centre Responds
  • పాక్ సైన్యంపై ఆత్మాహుతి దాడి.. 13 మంది సైనికుల మృతి
  • దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ ఆరోపణ
  • పాక్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
  • నిరాధార ఆరోపణలంటూ తిప్పికొట్టిన న్యూఢిల్లీ
తమ సైనికులపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ చేసిన నిరాధార ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలంటూ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్ సైన్యం చేసిన ఈ ప్రకటనను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

పాకిస్థాన్‌లోని వజీరిస్థాన్‌లో తమ సైనిక కాన్వాయ్‌పై శ‌నివారం జరిగిన దాడికి భారతే కారణమంటూ పాక్ సైన్యం అధికారికంగా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆదివారం స్పందించారు. "వజీరిస్థాన్ దాడి విషయంలో భారత్‌ను నిందిస్తూ పాకిస్థాన్ సైన్యం చేసిన ప్రకటనను చూశాం. ఆ ఆరోపణలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఆయన ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.

అసలేం జరిగింది?
శనివారం పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో పాక్ సైనిక కాన్వాయ్ లక్ష్యంగా భీకర ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నింపిన ఒక వాహనాన్ని ఆత్మాహుతి దళ సభ్యుడు నేరుగా సైనిక వాహన శ్రేణిలోకి నడిపి పేల్చివేశాడు. ఈ ఘటనలో 13 మంది పాకిస్థాన్ సైనికులు అక్కడికక్కడే చ‌నిపోయారు. మరో 10 మంది సైనికులు, 19 మంది సాధారణ పౌరులు తీవ్రంగా గాయపడినట్లు స‌మాచారం.

ఈ దాడికి పాల్పడింది 'ఫిత్నా-అల్-ఖ్వారిజ్' అనే సంస్థ అని పాక్ సైన్యానికి చెందిన మీడియా విభాగం 'ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్' (ఐఎస్‌పీఆర్) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, కొద్ది గంటలకే పాక్ సైన్యం మాట మార్చి ఈ దాడి వెనుక భారత్ ఉందని ఆరోపించడం గమనార్హం.

2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్థాన్‌లో, ముఖ్యంగా ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాలైన ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లలో హింసాత్మక ఘటనలు, ఉగ్రదాడులు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ దాడుల్లో సుమారు 290 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది భద్రతా సిబ్బందే ఉన్నారు. తమ గడ్డపై దాడులకు ఆఫ్ఘనిస్థాన్ సహకరిస్తోందని పాక్ ఆరోపిస్తుండగా, ఆ ఆరోపణలను తాలిబన్ ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది.
Pakistan
India
Ranadhir Jaiswal
Waziristan attack
Khyber Pakhtunkhwa
ISI
Inter-Services Public Relations
terrorism
suicide attack

More Telugu News