Amit Shah: నేడు తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న అమిత్ షా

Amit Shah to Inaugurate National Turmeric Board in Telangana Today
  • నేడు నిజామాబాద్ కు అమిత్ షా రాక
  • జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్న అమిత్ షా
  • పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే రైతు సభలో ప్రసంగించనున్న అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే రైతు సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు.

అలానే కంఠేశ్వర్ కూడలిలో మాజీ మంత్రి డి. శ్రీనివాస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా అమిత్ షా పాల్గొంటారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుతో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పసుపు రైతుల ఏళ్ల నాటి కల నేటితో ఫలించనుంది. పసుపు మద్దతు ధర రూ.15 వేలు చెల్లించాలని, జాతీయ బోర్డు ఏర్పాటు చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఎన్నో పోరాటాలు చేశారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసి నిరసన వ్యక్తం చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఆ సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిన కేంద్రం తాజాగా దాన్ని నెరవేరుస్తోంది.

ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ ఆవరణలో హెలిపాడ్ సిద్ధం చేశారు. నగరంలో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. 
Amit Shah
Telangana
National Turmeric Board
Nizamabad
Turmeric Farmers
Telangana Politics
D Srinivas
Farmers Protest
Turmeric Price

More Telugu News