Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం.. దోపిడీ దొంగలపై పోలీసుల ఫైరింగ్!

Visakha Express Firing Incident After Robbery Attempt in Palnadu
  • పల్నాడు జిల్లాలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం
  • పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద అర్ధరాత్రి ఘటన
  • మూడు రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు
  • పోలీసుల కాల్పులతో చీకట్లోకి పరారైన దుండగులు
పల్నాడు జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గత అర్ధరాత్రి కొందరు దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కాల్పులతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.

రైలు తుమ్మలచెరువు వద్దకు రాగానే ఓ ముఠా రైలులోకి ప్రవేశించి చోరీకి సిద్ధమైంది. గమనించిన రైల్వే భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దుండగులను చెదరగొట్టేందుకు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తుపాకీ శబ్దాలతో భయపడిపోయిన దొంగలు, దోచుకోవడానికి తెచ్చిన వస్తువులను అక్కడే వదిలేసి చీకట్లోకి పరారయ్యారు.  

కొద్దికాలంగా బీహార్, మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలు రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఈ ముఠాలు రెండుసార్లు దొంగతనాలకు పాల్పడ్డాయని, శనివారం రాత్రి మూడోసారి దోపిడీకి ప్రయత్నించడంతో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పరారైన దుండగుల కోసం రైల్వే పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Visakha Express
Visakha Express train
Andhra Pradesh
Palanadu district
Train robbery
Railway police
Firing
Theft attempt
Tummala Cheruvu
Bihar Maharashtra gangs

More Telugu News