Vallabhaneni Vamsi: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కేసులో వంశీకి ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో అప్పీల్

Vallabhaneni Vamsi Illegal Mining Case AP Govt to Appeal in Supreme Court
  • అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అప్పీల్ దాఖలుకు చర్యలు తీసుకోవాలని అడ్వొకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్) కార్యాలయ ప్రత్యేక అధికారిని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

వైసీపీ హయాంలో విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడటంతో ఖజానాకు రూ.195 కోట్ల నష్టం వాటిల్లిందని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ తేల్చింది. దీనిపై జిల్లా మైనింగ్ అధికారి ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు మే 14న కేసు నమోదు చేశారు.

ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది మే 29న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ పిటిషన్‌పై విచారణ జరిపి వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించింది. 
Vallabhaneni Vamsi
AP Government
Illegal Mining Case
Gannavaram
Supreme Court Appeal
Andhra Pradesh
YSRCP
High Court Bail

More Telugu News