Rohit Sharma: కోహ్లీ అద్భుతం.. కానీ అతడే అసలైన గేమ్ ఛేంజర్: టీ20 ఫైనల్‌పై రోహిత్‌

Rohit Sharma on Virat Kohli and Axar Patels T20 World Cup Final Performance
  • టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఒత్తిడిపై నోరు విప్పిన రోహిత్ శర్మ
  • మూడు వికెట్లు పడగానే డగౌట్‌లో కంగారుపడ్డానని వెల్లడి
  • కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడని ప్రశంస
  • అక్షర్ పటేల్ ఇన్నింగ్సే మ్యాచ్‌ను మలుపు తిప్పిందని స్పష్టం
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసి, టీమిండియా రెండోసారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024ను ముద్దాడిన విష‌యం తెలిసిందే.  దక్షిణాఫ్రికాతో జరిగిన హోరాహోరీ పోరులో భారత జట్టు విజయం సాధించింది. అయితే, ఆ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలోనే తాను, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరినప్పుడు డగౌట్‌లో తాను తీవ్రమైన కంగారుకు గురయ్యానని అప్ప‌టి కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. క్లిష్ట పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ నిర్మించిన కీలక భాగస్వామ్యమే జట్టును తిరిగి రేసులోకి తెచ్చిందని హిట్‌మ్యాన్‌ ప్రశంసించాడు.

స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ రోహిత్ శర్మ ఆనాటి ఒత్తిడిని గుర్తుచేసుకున్నాడు. "మేం ముందుగా మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. నేను చాలా కంగారుపడ్డాను. సౌకర్యంగా అస్సలు లేను. మేమే దక్షిణాఫ్రికాను మ్యాచ్‌లోకి ఆహ్వానించామని భావించాను" అని తెలిపాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న కోహ్లీ అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. టోర్నమెంట్ ఆసాంతం పెద్దగా రాణించకపోయినా ఫైనల్లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడని అన్నాడు.

"ఏ క్రికెటర్ అయినా తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు కొడితే మంచి ఆరంభం లభించినట్లే. అది చాలా ఒత్తిడిని తగ్గిస్తుంది. విరాట్‌కు కూడా అదే జరిగింది. ఎన్నో ఏళ్లుగా భారత్ తరఫున ఆడుతున్న అనుభవం అతనికి ఉంది. భావోద్వేగాలను, ఆలోచనలను నియంత్రించుకుని, వర్తమానంలో ఎలా ఉండాలో అతనికి తెలుసు. 'ఈ రోజు నేను ఏకాగ్రతతో ఆడాలి' అని అతను బలంగా అనుకుని ఉంటాడు. అందుకే అంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు" అని రోహిత్ వివరించాడు.

అయితే, కోహ్లీ ఇన్నింగ్స్ మ్యాచ్‌కు కీల‌కంగా నిలిస్తే, అక్షర్ పటేల్ ఆడిన ఇన్నింగ్సే గేమ్‌ను మలుపు తిప్పిందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. "అక్షర్ ఇన్నింగ్స్ గురించి ఎక్కువ మంది మాట్లాడటం లేదు. కానీ, అదే అసలైన గేమ్ ఛేంజర్. ఆ దశలో 31 బంతుల్లో 47 పరుగులు చేయడం చాలా కీలకం. మాకు ఒక ఎండ్‌లో చివరి వరకు నిలిచే బ్యాటర్ అవసరం కాగా, విరాట్ ఆ పాత్రను అద్భుతంగా పోషించాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్, అక్షర్, హార్దిక్ తమ వంతు పాత్ర పోషించడంతో మేం మంచి స్కోరు సాధించగలిగాం" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఇక‌, ఈ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. ఈ చారిత్రక విజయం తర్వాత గంటల వ్యవధిలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌కు తమ రిటైర్మెంట్ ప్రకటించగా, ఆ మరుసటి రోజు రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 
Rohit Sharma
Virat Kohli
Axar Patel
T20 World Cup 2024
India vs South Africa
Cricket
T20 Finals
Indian Cricket Team
Rishabh Pant
Suryakumar Yadav

More Telugu News