Jagan Mohan Reddy: అది జగన్ కారే.. నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక?

Jagan Car Accident Forensic Report States No Video Manipulation in Singayya Death
  • సింగయ్య మృతి ఘటనలో వీడియో అసలైనదేనని నిర్ధారణ?
  • వీడియోలో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని తేల్చిన ఫోరెన్సిక్ నివేదిక!
  • జులై 1న జగన్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ  
  • అదే రోజున కోర్టుకు ఫోరెన్సిక్ నివేదికను సమర్పించనున్న పోలీసులు
పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో సింగయ్య మృతి చెందిన ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో అసలైనదేనని, అందులో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) తన నివేదికలో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నివేదిక పోలీసులకు అందడంతో దర్యాప్తులో ఇది ఒక ముఖ్యమైన ఆధారంగా మారింది.

పర్యటన సందర్భంగా జగన్ ప్రయాణిస్తున్న కారు ముందు చక్రం కింద సింగయ్య నలిగిపోతున్న దృశ్యాలు ఒక సెల్‌ఫోన్‌లో రికార్డయ్యాయి. ఆ తర్వాత ఆ వీడియో వైరల్ అయింది. అయితే, ఈ వీడియో నకిలీదని, జగన్‌ను ఈ కేసులో ఇరికించేందుకు మార్ఫింగ్ చేశారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసులు ఆ వీడియో క్లిప్‌ను, ఘటనా స్థలంలో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీడియో రికార్డ్ చేసిన సెల్‌ఫోన్ ఐడీ, అది ఉన్న లొకేషన్ వంటి సాంకేతిక వివరాలను విశ్లేషించిన నిపుణులు, ఆ వీడియో ఒరిజినల్ అని, ఎడిటింగ్ జరగలేదని నిర్ధారించినట్టు తెలిసింది.

జులై 1న హైకోర్టులో విచారణ 
ఈ కేసులో తన ప్రమేయం లేదని, తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జులై 1న ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. అదే రోజున పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ మొన్న కోర్టుకు అందించారు. పూర్తి సాంకేతిక ఆధారాలు సమర్పించేందుకు గడువు కోరగా, కోర్టు అందుకు అంగీకరించింది.

పకడ్బందీగా పోలీసుల దర్యాప్తు
ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనానికి ఇప్పటికే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేశారు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన దాదాపు పది మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఈ కేసులో జగన్‌తో పాటు  కారు డ్రైవర్ రమణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజని తదితరులను నిందితులుగా చేర్చారు.

అయితే, ప్రధాన నిందితుడు, కారు డ్రైవర్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డి విచారణకు సరిగా సహకరించడం లేదని సమాచారం. ప్రమాద సమయంలో కారు బానెట్‌పై ఒక కార్యకర్త ఉండటంతో తనకేమీ కనిపించలేదని, అసలు చక్రాల కింద వ్యక్తి పడిన విషయమే తనకు తెలియదని పోలీసుల వద్ద వాదించినట్టు తెలిసింది. స్థానికులు అప్రమత్తం చేసిన తర్వాత కారును వెనక్కి తీసినట్లు వీడియోలో ఉన్నా, డ్రైవర్ తన వాదన మార్చుకోలేదని తెలుస్తోంది. 

Jagan Mohan Reddy
Singayya death case
YSRCP
Forensic report
Palanadu district
Viral video
High Court
AP Police
Accident investigation
Ramana Reddy

More Telugu News