Affair murder: కళ్లల్లో కారం చల్లి.. కాలితో గొంతు నొక్కి..భర్తను అత్యంత కిరాతకంగా చంపిన భార్య

Wife Kills Husband in Tumakuru for Affair
  • కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో దారుణం
  • మిస్సింగ్ కేసు అనుకుంటే హత్యగా తేలిన వైనం
  • ఫోన్ కాల్ డేటాతో గుట్టు రట్టు చేసిన పోలీసులు
  • మృతదేహాన్ని 30 కిలోమీటర్లు మోసుకెళ్లి బావిలో పడేసిన మహిళ
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిందో భార్య. అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ బావిలో పడేసింది. ఈ ఘటన జూన్ 24న తుమకూరు జిల్లా తిప్టూరు తాలూకాలోని కడశెట్టిహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడశెట్టిహళ్లి గ్రామానికి చెందిన శంకరమూర్తి (50) తన వ్యవసాయ క్షేత్రంలోని ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆయన భార్య సుమంగళ తిప్టూరులోని కల్పతరు బాలికల హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు కరదాలుశాంతే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సుమంగళ, ప్రియుడు నాగరాజుతో కలిసి అతడిని హతమార్చాలని పథకం పన్నింది.

పథకం ప్రకారం జూన్ 24న భర్త శంకరమూర్తి కళ్లలో సుమంగళ కారం పొడి చల్లింది. అనంతరం కర్రతో దారుణంగా కొట్టి, గొంతుపై కాలితో తొక్కి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ గోనెసంచిలో కుక్కి, సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తురువెకెరె తాలూకాలోని దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలోని బావిలో పడేసింది.

శంకరమూర్తి కనిపించకపోవడంతో మొదట నొణవినకెరె పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు శంకరమూర్తి మంచం వద్ద కారం పొడి ఆనవాళ్లు, పెనుగులాట జరిగిన గుర్తులు గుర్తించి అనుమానంతో విచారణ ముమ్మరం చేశారు. సుమంగళ మొబైల్ కాల్ డేటా రికార్డులను పరిశీలించి, ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Affair murder
Husband killed
Sumangala
Karnataka crime
Tumakuru district
extra marital affair
lover
crime news
police investigation

More Telugu News