Li: కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లింది.. గంటలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది!

Li in China shocked by unexpected birth after stomach pain
  • చైనాలోని హుబే ప్రావిన్స్‌లో ఘటన
  • కడుపులో నొప్పిగా ఉంటే అజీర్తి సమస్యనుకుని ఆసుపత్రికి
  • వైద్య పరీక్షల్లో బయటపడిన నిజం
  • 9 నెలలుగా తాను గర్భవతినన్న విషయాన్ని గమనించని మహిళ
కడుపునొప్పిగా ఉందని ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళ గంట వ్యవధిలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆశ్చర్యకరమైన ఘటన చైనాలో వెలుగుచూసింది. తాను గర్భవతినన్న విషయమే తెలియకపోవడంతో, ఈ పరిణామం చూసి ఆమె పూర్తిగా నివ్వెరపోయింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్‌కు చెందిన ఎజౌ నగరంలో జూన్ 16న ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. లీ అనే మహిళ మధ్యాహ్నం ఎక్కువగా భోజనం చేయడంతో కడుపులో తీవ్రమైన నొప్పి మొదలైంది. అజీర్తి సమస్యేమోనని భావించిన ఆమె చికిత్స కోసం తన ఎలక్ట్రిక్ బైక్‌పై మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమీపంలోని ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్ పరీక్ష నిర్వహిస్తుండగా నొప్పి మరింత ఎక్కువైంది.

అదే సమయంలో ఆమెకు ఉమ్మనీరు పోవడంతో వైద్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆమె గర్భవతి అని, ప్రసవ నొప్పులతో బాధపడుతోందని నిర్ధారించుకున్నారు. వెంటనే ప్రసూతి బృందాన్ని ఏర్పాటు చేసి ఆమెకు సహాయం అందించారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాలకు లీ సహజ ప్రసవంలో 2.5 కిలోల బరువున్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రికి వచ్చిన గంటలోనే ఈ పరిణామాలన్నీ జరిగిపోవడం గమనార్హం.

ఈ అనూహ్య ఘటనపై లీ మాట్లాడుతూ, "మీరు గర్భవతి అని వైద్యులు చెప్పినప్పుడు నేను పూర్తిగా అయోమయానికి గురయ్యాను" అని తెలిపారు. తనకు ఇప్పటికే ఆరేళ్ల కొడుకు ఉన్నాడని, రెండో బిడ్డను కనాలని తాను, తన భర్త ప్లాన్ చేసుకోలేదని ఆమె పేర్కొన్నారు. ప్రసవ సమయంలో తన భర్త ఊర్లో లేరని చెప్పారు.

గర్భం దాల్చిన విషయం ఎందుకు తెలియలేదన్న ప్రశ్నకు ఆమె వివరణ ఇచ్చారు. "నా మొదటి గర్భం సమయంలో వేవిళ్లు ఎక్కువగా ఉండేవి. కానీ ఈసారి అలాంటి లక్షణాలేవీ కనిపించలేదు. నా నెలసరి కూడా ఎప్పుడూ క్రమపద్ధతిలో రాదు. అందుకే చాలాకాలంగా రుతుస్రావం ఆగిపోయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. గత కొన్ని నెలలుగా కొంచెం బరువు పెరిగాను కానీ, గర్భానికి సంబంధించిన ఏ ఇతర లక్షణాలు లేకపోవడంతో అనుమానం రాలేదు" అని లీ అన్నారు.

"గర్భవతిని అని తెలియక నేను తరచుగా ఎలక్ట్రిక్ బైక్‌పై తిరిగేదాన్ని. అదృష్టవశాత్తూ, బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇది వాడి బతుకు పోరాటాన్ని చూపిస్తోంది" అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రసవానంతరం మెరుగైన సంరక్షణ కోసం ఆమెను, నవజాత శిశువును మున్సిపల్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
Li
China
Unexpected pregnancy
Hubei Province
Ezhou
Childbirth
Unaware of pregnancy
Sudden birth
Healthy baby
Electric bike

More Telugu News