Egg consumption India: పొరుగు దేశాలతో పోలిస్తే గుడ్ల వినియోగంలో మనమే టాప్.. కానీ..!

Egg consumption higher in India compared to neighboring countries
  • తలసరి గుడ్ల వినియోగంలో దక్షిణాసియాలోనే భారత్ నెం.1.. 
  • ప్రపంచ సగటుతో పోలిస్తే వినియోగం సగమే
  • ఆహార ఖర్చులో పాలు, కూరగాయల కన్నా ప్రాసెస్డ్ ఫుడ్‌కే అధిక ప్రాధాన్యం
  • ఆదాయం పెరగడం ఒక కారణమని నిపుణుల అంచనా
కోడిగుడ్ల తలసరి వినియోగంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లను భారత్ అధిగమించింది. ఆదాయం పెరగడంతో పాటు పోషకాహారంపై అవగాహన పెరగడమే దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ ఇంకా చాలా వెనుకబడే ఉందన్నారు.
 
‘అవర్ వరల్డ్ ఇన్ డేటా’ గణాంకాల ప్రకారం.. తలసరి గుడ్ల వినియోగంలో భారత్ 2018లో పాకిస్థాన్‌ను అధిగమించింది. మూడు దశాబ్దాలకు పైగా మనకంటే ముందున్న పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి అప్పటి నుంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. 2022 నాటికి, భారత్‌లో వార్షిక తలసరి గుడ్ల వినియోగం 4.6 కిలోలుగా నమోదు కాగా, పాకిస్థాన్‌లో ఇది 3.7 కిలోలుగా ఉంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో 3.6 కిలోలు, శ్రీలంకలో 3.7 కిలోలు, నేపాల్‌లో కేవలం 2 కిలోలుగా నమోదైంది.

దక్షిణాసియాలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ప్రపంచ సగటుతో పోల్చినప్పుడు భారత్ వినియోగం చాలా తక్కువ. 2022లో ప్రపంచవ్యాప్తంగా తలసరి గుడ్ల వినియోగం 10.4 కిలోలుగా ఉంది. అంటే, ప్రపంచ సగటులో మనం సగం కంటే తక్కువే తింటున్నామని స్పష్టమవుతోంది.

భారత ప్రభుత్వ గణాంకాల మంత్రిత్వ శాఖ (2023-24) నివేదిక ప్రకారం, భారతీయుల ఆహార ఖర్చులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తమ నెలవారీ ఖర్చులో 11.1%, గ్రామీణ ప్రాంతాల్లో 9.8% కూల్ డ్రింకులు, చిప్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్ కోసమే వెచ్చిస్తున్నారు. పాలు, కూరగాయల కన్నా వీటికే ఎక్కువ ఖర్చు చేస్తుండటం గమనార్హం. గుడ్ల వినియోగం పెరగడం మంచి పరిణామమే అయినా, ప్రాసెస్డ్ ఫుడ్ వైపు మొగ్గు చూపడం ఆహార అలవాట్లలోని మరో కోణాన్ని తెలియజేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Egg consumption India
Pakistan
Bangladesh
Sri Lanka
Nepal
Egg consumption South Asia
Processed food consumption India
Nutrition India
Our World in Data

More Telugu News