Prasad Suri: రెండో నవలకే నేషనల్ అవార్డ్... యువ రచయిత ప్రసాద్ సూరిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

- యువ రచయిత ప్రసాద్ సూరికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారం
- పేద మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన యువకుడికి అరుదైన గౌరవం
- ప్రసాద్ సూరిని సోషల్ మీడియా వేదికగా అభినందించిన సీఎం చంద్రబాబు
- రాసిన రెండో నవలకే ఈ పురస్కారం లభించడం విశేషం
- ప్రసాద్ రాష్ట్రానికి, తన జాతికి కీర్తి తెచ్చారని కితాబు
- సాహిత్యంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్ష
యువ రచయిత ప్రసాద్ సూరి (సూరాడ ప్రసాద్) ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పేద మత్స్యకార కుటుంబంలో పుట్టి, సాహిత్యంపై మక్కువతో అద్భుతమైన ప్రతిభ కనబరచడం ఎంతో సంతోషాన్నిచ్చే విషయమని కొనియాడారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"పేద మత్స్యకార కుటుంబంలో పుట్టి సాహిత్యంపై మక్కువతో రాసిన రెండో నవలకే ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇంతటి అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రసాద్ సూరి (సూరాడ ప్రసాద్)కి అభినందనలు. సముద్రపు లోతు చూసే మత్స్యకారులకు మనిషి జీవితపు ఎత్తుపల్లాలు చూడడం కష్టమేమీ కాదు అని నిరూపించిన ప్రసాద్ సూరి రానున్న రోజుల్లో సాహిత్యపు శిఖరం తాకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రానికి, తను జన్మించిన జాతికి ఎనలేని ప్రతిష్ఠ తెచ్చిపెట్టిన ప్రసాద్ సూరికి మరొక్క మారు శుభాభినందనలు" అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.