Chandrababu Naidu: నిజం గడప దాటేలోగా... అబద్దం ఊరంతా చుట్టి వస్తుంది!: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Warns TDP Leaders About Opposition Propaganda
  • ప్రభుత్వ వార్షికోత్సవం సందర్భంగా 'సుపరిపాలనలో తొలిఅడుగు' కార్యక్రమం
  • నెల రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు చంద్రబాబు ఆదేశం
  • మనం చేసిన మంచి పనులను వివరిస్తూనే, వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు
  • ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సర్వేలు చేయిస్తున్నా.. బాగోకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక
  • తప్పులు పునరావృతం కావొద్దని, 2029 గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచన
  • రాజకీయ ముసుగులో ఉన్న ఆర్థిక ఉగ్రవాదులతో ప్రమాదమని తీవ్ర విమర్శలు
 ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ పన్నుతున్న కుట్రలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా, నెల రోజుల పాటు ప్రజల్లో విస్తృతంగా పర్యటించాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పరిశీలకులతో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు.

తప్పులు రిపీట్ చేయొద్దు!

గతంలో తాము చేసిన తప్పులు పునరావృతం కాకూడదని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. నిజం గడప దాటేలోగా... అబద్దం ఊరంతా చుట్టి వస్తుంది... అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. "2014లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. కానీ, వాటిని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయాం, రాజకీయం మరిచిపోయాం. చాపకింద నీరులా టీడీపీపై అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. వివేకానందరెడ్డి హత్యే దీనికి పెద్ద ఉదాహరణ. గుండెపోటు అని మొదట ప్రచారం చేసి, ఆ తర్వాత నాటకాలు ఆడి ప్రజల సానుభూతి పొందారు. కోడికత్తి డ్రామా, ఎన్నికల ముందు గులకరాయి డ్రామా వంటివి వారి కుట్ర రాజకీయాలకు నిదర్శనం. ఇలాంటి దుష్ప్రచారాలను తేలిగ్గా తీసుకోవద్దు. మనం చేస్తున్న మంచిని ఎంత బలంగా వివరిస్తామో, వారి కుట్రలను కూడా అదే స్థాయిలో ప్రజలకు వివరించాలి" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉంటే ఆదరిస్తారు... లేకుంటే టాటా చెప్పేస్తారు

ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రాముఖ్యతను చంద్రబాబు నొక్కిచెప్పారు. "పనిచేయడం ఒక ఎత్తయితే, జనానికి అందుబాటులో ఉండటం మరో ఎత్తు. ప్రజల్లోకి వెళ్లడానికి ఎలాంటి నామోషీ వద్దు. చేసిన పనులతో పాటు, చేయలేని పనులకు గల కారణాలను కూడా వివరించాలి. ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే, వారు అంతగా ఆదరిస్తారు. లేదంటే నిర్మొహమాటంగా టాటా చెప్పేస్తారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన పనితీరు ఉండాలి" అని సూచించారు.

ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడతా... మంచి చెడులు వివిస్తా

ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును తాను నిరంతరం గమనిస్తున్నానని, వివిధ మార్గాల్లో సర్వేలు చేయిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. "ప్రతి ఎమ్మెల్యేతో త్వరలోనే నేను స్వయంగా సమావేశమవుతాను. ఇప్పటికే నలుగురితో మాట్లాడాను. వారు చెప్పేది ఓపిగ్గా వింటాను. వారిలో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకోవడానికి సమయం ఇస్తాను. మారితే సంతోషం, లేదంటే నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడను. వారసులైనా సరే, కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు ఉంటుంది. పని చేయకుండా పదవులు ఆశిస్తే కుదరదు, వారికో నమస్కారం పెట్టేస్తా" అని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.

ప్రజలకు జవాబుదారీగా ఉందాం... పొరపాట్లు ఉంటే సరి చేసుకుందాం

పాలనలో ఏమైనా లోటుపాట్లు, పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుని ముందుకు సాగుదామని చంద్రబాబు అన్నారు. "ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. అదే మన లక్ష్యం. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలనుకోవడం బాధాకరం. గత ఎన్నికల్లో ప్రత్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినా 11 సీట్లకే పరిమితమయ్యారు. డబ్బు అన్నివేళలా పనిచేయదు. మనం ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం" అని ఆయన పిలుపునిచ్చారు.

ప్రభుత్వ కొనసాగింపుతోనే అభివృద్ధి... కళ్ల ముందున్న వాస్తవమిది

సుస్థిర ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చంద్రబాబు అన్నారు. "2004, 2019లో టీడీపీ ఓడిపోవడం వల్ల రాష్ట్రం తిరోగమనం పట్టింది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ పారిశ్రామికవేత్తలు నమ్మకంతో ముందుకొస్తున్నారు. ఏడాదిలోనే రూ.9.34 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. దీని ద్వారా 8.50 లక్షల ఉద్యోగాలు వస్తాయి" అని తెలిపారు. పోలవరం, అమరావతి పనులు వేగవంతం చేశామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాట పట్టిస్తున్నామని వివరించారు.

కార్యకర్తలను మరువొద్దు

సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ తమ ప్రభుత్వం ముందుందని చంద్రబాబు పేర్కొన్నారు. "64 లక్షల మందికి పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, డీఎస్సీ నోటిఫికేషన్, అన్నా క్యాంటీన్లు వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తాం. విధానాలు ఎంత బాగున్నా, వాటి అమలులో లోపాలుంటే ప్రయోజనం ఉండదు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో బాధ్యతగా పనిచేయాలి. 2029లో గెలుపే నా ప్రణాళిక. అందుకోసం కష్టపడి పనిచేయడం కాదు, స్మార్ట్‌గా పనిచేయాలి" అని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగు వేసుకున్న ఆర్థిక ఉగ్రవాదులు, రౌడీలతో రాష్ట్రానికి ప్రమాదమని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
Chandrababu Naidu
TDP
Telugu Desam Party
Andhra Pradesh
AP Politics
YS Jagan
YSRCP
Governance
Political Strategy
Public Outreach

More Telugu News