JC Prabhakar Reddy: ఇక మీకు రఫా రఫానే... పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్!

JC Prabhakar Reddy Issues Mass Warning to Pedda Reddy
  • తాడిపత్రిలో మరోసారి భగ్గుమన్న రాజకీయ వైరం
  • తాను మూడు రోజులు ఊళ్లో ఉండటం లేదని జేసీ ప్రకటన
  • నీ ఇల్లు కూలగొట్టేస్తారేమో అంటూ వ్యాఖ్యలు
  • తన శత్రువు పెద్దారెడ్డే కానీ వైసీపీ కార్యకర్తలు కాదన్న జేసీ
  • తన పోరాటం చట్టబద్ధంగానే ఉంటుందని వెల్లడి
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తాను కొన్ని రోజుల పాటు ఊరిలో ఉండటం లేదని, ఈ సమయంలో ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని, లేదంటే కూల్చివేస్తారేమోనని జేసీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఇక మీకు రఫా రఫా తప్పదని హెచ్చరించారు.

తాజాగా తన అనుచరులతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను ఊరికి వెళుతున్నా. ఓ మూడు రోజుల్లో నీ ఇంటిని ప్రొక్లైనర్ పెట్టి కూల్చేస్తారేమో.. కాపాడుకో పెద్దారెడ్డి. నీకోసమే కాచుకుని ఉన్నారు" అంటూ బహిరంగంగా హెచ్చరించారు. తన కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని, ఇన్నాళ్లూ తానే వారిని అదుపు చేస్తూ వచ్చానని తెలిపారు. "మా వాళ్లు చాలా కోపంగా ఉన్నారు. రఫ్ఫాడించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను గట్టిగా పట్టుకుని కూర్చున్నాను కాబట్టే ఆగుతున్నారు. నేను లేనప్పుడు ఏం జరుగుతుందో చూసుకో" అని వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వ హయాంలో తాము, తమ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డామని, మహిళలు కూడా జైలుకు వెళ్లారని జేసీ గుర్తుచేశారు. ఆ కక్షతోనే తన అనుచరులు రగిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, తన శత్రుత్వం కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డితోనే తప్ప, వైసీపీ కార్యకర్తలతో కాదని ఆయన స్పష్టం చేశారు. "మాకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమే, వైసీపీ కార్యకర్తలు కాదు. ఇప్పటివరకు మేం ఏ కార్యకర్తను ఏమీ అనలేదు. అందరిపైనా చట్ట ప్రకారమే ముందుకెళుతున్నాం," అని జేసీ వివరించారు. పెద్దారెడ్డి ఇంటి నిర్మాణంలో కూడా చట్టపరమైన లోపాలు ఉన్నాయని, అయినా తాము చట్టబద్ధంగానే వెళుతున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా తన పోరాటం వ్యక్తిగతమని, తాను, తన పిల్లలు ఈ శత్రుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభాకర్ రెడ్డి తేల్చిచెప్పారు. ప్రజలకు తాను ఏంటో తెలుసని, అందుకే తనను గెలిపించారని అన్నారు. జేసీ చేసిన ఈ వ్యాఖ్యలతో తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
JC Prabhakar Reddy
Tadipatri
Kethi Reddy Pedda Reddy
Anantapur
Andhra Pradesh Politics
Political rivalry
Municipal Chairman
YSRCP
Telugu Desam Party
Political threats

More Telugu News